Sep 25,2023 22:45

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న రాఘవేంద్ర మీనా

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణ దానం చేయవచ్చని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా అన్నారు. సిటీ యూనియన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ 18వ వార్షికోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకులో ఆ బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లు సోమవారం రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఒక దాత ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చన్నారు. సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్‌ 2వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్‌ మోహన్‌ రావు మాట్లాడుతూ మలేరియా, డెంగీ కేసులు పెరుగుతున్నాయని, అవసరమైన ప్లేట్‌లైట్స్‌ అందించడానికి రక్తం కొరత ఉందన్నారు. దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. శిబిరంలో సిటీ యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఎల్‌.సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు సేవా కార్యక్రమంలో కూడా తమ బ్యాంకు ముందుందన్నారు. కస్టమర్ల సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. శిబిరంలో రెడ్‌క్రాస్‌ సభ్యులు ఎం.కళ్యాణ్‌ చక్రవర్తి, పి.చైతన్య కుమార్‌, కె.సత్యనారాయణ, బ్యాంకు సహాయ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ నాయక్‌, పి.ఎన్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.