Jun 14,2023 22:57

రక్తదాతల దినోత్సవంలో ప్రసంగిస్తున్న రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌ కాపు భారతి

       అనంతపురం కలెక్టరేట్‌ : రక్తదానం ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చని జిల్లా వైద్యాధికారి వీరబ్బాయి తెలిపారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని బుధవారం స్థానిక ఐఎంఎ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా వైద్యాధికారితో పాటు అదనపు వైద్యాధికారి డాక్టర్‌ అనుపమ జేమ్స్‌, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కృష్ణకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్త నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. రక్తం నిర్ధారణ చేసుకని గ్రూపు తెలుసుకోవడం వల్ల ఎదుటి వారు ఆపదలో ఉన్న సమయంలో రక్తదానం చేసే అవకాశం ఉంటుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందలూ ఉండవన్నారు. రక్తదానంపై అపోహలు వీడాలన్నారు. రెడ్‌ క్రాస్‌ ఛైర్‌పర్సన్‌ కాపు భారతి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమన్నారు. అందరూ బాధ్యతగా తీసుకుని సంవత్సరానికి రెండు సార్లైనా రక్తదానం చేయడాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. రెడ్‌ క్రాస్‌ ద్వారా సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ బ్లడ్‌బ్యాంక్‌కు అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకుకు రక్తదాన శిబిరాలు నిర్వహించి తోడ్పాటు అందించిన రక్తదాతలు, శిబిర నిర్వాహకులను సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరాల్లో రక్తదాన శిబిరాలు నిర్వాహించిన 55 మందికి జ్ఞాపికను అందచేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మణ ప్రసాద్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌ పరదేశి నాయుడు, పుల్లయ్య, రెడ్‌ క్రాస్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ మనోరంజన్‌ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.