Oct 02,2023 21:44

ఫొటో : రక్తదాన శిబిరంలో పాల్గొన్న డిఎస్‌పి కోటారెడ్డి

రక్తదానం ప్రాణదానంతో సమానం
- మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, డాక్టర్‌ కెవి శ్రావణ్‌ కుమార్‌
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మందికి ఇలా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దాతలు ప్రాణదాతలుగా మారుతారని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, అభిరామ్‌ హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ అధినేత డాక్టర్‌ కెవి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. ఆత్మకూరులోని అభిరామ్‌ ఆసుపత్రిలో గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆత్మకూరు డిఎస్‌పి కోటారెడ్డి, సిఐ జి.వేణు, ఎస్‌ఐ ముత్యాలరావు, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాములు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
తొలుత జాతిపిత గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి కోటారెడ్డి మాట్లాడుతూ అభిరామ్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో 18 సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రెడ్‌క్రాస్‌ వారికి అనేక యూనిట్ల రక్తాన్ని అందించారని తెలిపారు. ఇలా స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారిని ప్రోత్సహించేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న డాక్టర్‌ శ్రావణ్‌, కుమార్‌ వారి సిబ్బంది అభినందనీయులు అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక పోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛంద రక్తదానం చేయాలన్నారు. రక్తదానం వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ ఎటువంటి నష్టం ఉండదన్నారు. ఎంవిఐ రాములు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించిన సమయంలో ఎక్కువ రక్తం అవసరమవుతుందని, ఇలాంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తంతో వారికి ప్రాణదానం చేస్తారని తెలిపారు. యువత ఇలా రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని అందించి ప్రాణదాతలుగా మారుతున్నారన్నారు. అభిరామ్‌ హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ అధినేత డాక్టర్‌ కెవి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 18 సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 86 మంది యువకులు రక్తదానం చేశారని, వారిందరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస స్కూల్‌ రెస్పాండెంట్‌ 23వ వార్డ్‌ కౌన్సిలర్‌ చెరుకూరు కామాక్షయ్య నాయుడు, శ్రీనివాసులు నాయుడు, దోర్నాధుల సురేష్‌ సొసైటీ చైర్మన్‌ సాధిక్‌ హుస్సేన్‌, స్రెడ్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వాగాల శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.