
* ఒపిఎస్‌ను అమలు చేస్తామని జిపిఎస్‌తో మోసం
* ఉద్యోగులు, ఉపాధ్యాయుల వినూత్న నిరసన
ప్రజాశక్తి - కవిటి, సోంపేట: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ (ఒపిఎస్)ను అమలు చేస్తామని హామీనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేశారని ఫ్యాప్టో, సిపిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామన్నారు. జిపిఎస్‌కు వ్యతిరేకంగా కవిటి మండల కేంద్రంలో ఫ్యాప్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు గురువారం ర్యాలీ నిర్వహించి, ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం మానవహారం నిర్వహించి జిపిఎస్ ప్రతులను దగ్ధం చేశారు. సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన సోంపేట మండల కేంద్రంలోని ఎంఆర్‌సి భవనం వద్ద జిపిఎస్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిపిఎస్ వద్దని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అసెంబ్లీలో ఏకపక్షంగా జిపిఎస్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందన్నారు. గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్‌కు గ్యారంటీ పెన్షన్ అని పేరు పెట్టడం తమను మోసం చేయడమేనన్నారు. అధికారంలోకి రాక ముందు జగన్ సిపిఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీనిచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత సిపిఎస్ రద్దు చేయకుండా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ పేరుతో మరో మోసానికి తెరలేపారని ధ్వజమెత్తారు. పాత పెన్షన్ విధానం తప్ప మరేదీ ఆమోదించేది లేదని తేల్చిచెప్పారు. గత పిఆర్‌సిలో అంకెల గారడీ చేసిన జగన్ ప్రభుత్వం అదే రీతిలో జిపిఎస్ విధానంలో అవలంభిస్తోందన్నారు. పాత పెన్షన్ విధానాన్ని సాధించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు గోపి, శ్రీరామ్మూర్తి, రాజబాబు, మొర్రి గోపి, సిపిఎస్ ఇఎ సోంపేట మండల అధ్యక్షులు చంద్రశేఖర్, నాయకులు నారాయణరావు, ఈశ్వరరావు, దాలిబందు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.