May 12,2022 22:15

రెండో రోజు గుడిపల్లిలో చంద్రబాబు పర్యటన

చంద్రబాబు దృష్టికి విద్యార్థుల సమస్యలు
'బాదుడే బాదుడు'కు విశేష స్సందన
ప్రజాశక్తి -చిత్తూరు ప్రతినిధి

'రిజిస్ట్రార్‌ అకృత్యాలకు అవధుల్లేకుండా పోతోంది.. కావాలనే కొన్ని కోర్సుల్లో విద్యార్థులు చేరకుండా చేస్తున్నారు.. దీనివల్ల దూరప్రాంతం నుంచి వచ్చే అధ్యాపకులు తిరిగి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కుట్ర చేస్తున్నారు. ఇలా ఇరవై మంది దగ్గర ఇప్పటికే 50 లక్షలు పైగా వసూలు చేశారు' అని ఓ ఫ్యాకల్టీ అధ్యాపకుని ఆవేదన. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రెండో రోజు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుడిపల్లి మండలం ద్రవిడ వర్సిటీలో పర్యటించారు. యూనివర్సిటీ బార్సు హాస్టల్‌ దుస్థితిపై చంద్రబాబుకు ఫొటోలు చూపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది మాట్లాడుతూ బాబు వస్తే గాని తమ బాధలు పోవన్నారు. యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. 'బాబు రావాలి.. బాధలు తీరాలి' అంటూ నినాదాలు చేశారు. ఇటీవల ఇక్కడ అమ్మాయిల వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్‌ అయితే ఇప్పటివరకూ నివేదిక రాలేదని చెప్పారు. ప్లేస్మెంట్స్‌ కూడా ఉండడం లేదని వాపోయారు. స్కాలర్‌షిప్‌లు రావడం లేదన్నారు. చంద్రబాబు స్పందిస్తూ తనపై కోపంతో ద్రవిడ వర్సిటీలో సౌకర్యాలు కల్పించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు.
జగన్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి
గుడిపల్లి మండలంలోని పోగురుపల్లి గ్రామ పంచాయతీలో 'బాదుడే బాదుడు' నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నారు. రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని, సామాన్య ప్రజలు బతకాలంటే కష్టమైపోయిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక, యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సొంత బాబాయిని చంపిన వ్యక్తులను పట్టుకోలేని దద్దమ్మ జగన్మోహన్‌రెడ్డి అని, సొంత చెల్లెలికి, అమ్మకు న్యాయం చేయని తుగ్లక్‌ రాష్ట్రానికి ఏం చేస్తాడన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాబుకు ఘన స్వాగతం పలికారు. గొడుగు నీడలోనే సభలను నిర్వహించారు. దాసమానపల్లి, కుప్పిగానపల్లి, అగరం, యమగానిపల్లి, కనమనపల్లి, తుండ్లనగర గ్రామ పంచాయతీల్లో 'బాదుడే బాదుడు' నిర్వహించారు.