రీసర్వేతో భూసమస్యలు తీరుతాయి..!
అక్టోబర్ 2న భూహక్కు పత్రాలు పంపిణీ : చిత్తూరు ఆర్డీఓ రేణుక
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రీసర్వే కార్యక్రమం 100 సంవత్సరాల తర్వాత చేపట్టడం జరిగిందని చిత్తూరు ఆర్డీఓ రేణుక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రజాశక్తితో మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నాటికి భూహక్కు పత్రాలను పంపిణీ చేసే దిశగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది పనిచేయనున్నట్లు తెలిపారు. నిర్ణయించిన రెవెన్యూ గ్రామాల్లో అక్టోబర్ నాటికి రీసర్వే పూర్తి చేసి భూహక్కు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయాలు, స్పందన కార్యక్రమానికి భూసమ్యలు ఎక్కువగా వస్తున్నాయని రీసర్వే అనంతరం భూసమస్యలు తగ్గే అవకాశముందన్నారు.
డ్రోన్‌ప్లే చేయడంతో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని, జిల్లా వ్యాప్తంగా 48గ్రామాల్లో 13నోటిఫికేషన్ విడుదల చేశామని, 75 గ్రామాలలో గ్రౌండ్ వాలిడేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములు మినహా, ఇతర భూములు రీసర్వే చేయడం జరుగుతోందని తెలిపారు. అలాగే అన్నదమ్ముల మధ్య భాగపరిష్కారాలు, సరిహద్దులు, తమ భూమి ఎంత ఉంది అనే విషయాలను రీసర్వే ద్వారా ప్రభుత్వం పక్కాగా తెలియజేస్తోందన్నారు. ఏవైనా అభ్యంతరాలు, ఆక్షేపణులు ఉంటే స్థానిక డిటి ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రజాశక్తి: చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో భూరీసర్వే ఎలా జరుగుతోంది.?
ఆర్‌డీఓ: రీసర్వే 20 రెవెన్యూ గ్రామాల్లో పూర్తి చేశాం. 154 గ్రామాల్లో డౌన్ సర్వే పూర్తి అయ్యింది. తొమ్మిది రెవెన్యూ గ్రామాల్లో నోటిఫికేషన్ పూర్తి చేయడం జరిగింది. అలాగే రెండు గ్రామాల్లో రికార్డు మ్యాపింగ్ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ధేశాల మేరకు అక్టోబర్ రెండు నాటికి రీసర్వే పూర్తిచేసిన గ్రామాల్లో భూహక్కు పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది.
ప్రజాశక్తి : ఎప్పటిలోగా భూరీసర్వే పూర్తి చేస్తారు...?
ఆర్‌డిఒ: భూరీసర్వే శరవేగంగా జరుగుతోంది. ఇందు కోసం రెవెన్యూ సిబ్బంది పూర్తిగా కేంద్రీకరించి పనిచేస్తున్నారు. డిసెంబర్ నాటికి రీసర్వే పూర్తి అయ్యే అవకాశాలున్నాయి. ప్రతి మూడు రోజులకు రీసర్వేపై ఉన్నతాధికారులు రివ్యూ చేస్తున్నారు. ఆర్‌డిఒ కేంద్రం నుండీ సమీక్షిస్తూ సర్వేను వేగవంతం చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడం జరుగుతోంది.
ప్రజాశక్తి: రీసర్వేలో ఆక్షేపణలు ఉంటే ఎవరి సంప్రదించాలి..?
ఆర్‌డిఒ: భూరీసర్వే చేస్తున్న విషయం దండోరా వేస్తున్నాం. రైతులను దగ్గరుండాలని కోరుతున్నాం. ఎలాంటి సమస్యలున్నా డిటి మొబైల్ టీమ్‌కు సమాచారం ఇవ్వాలి. ఇలా వచ్చిన సమస్యలపై ఉన్నతాధికారులతో సంప్రదించి సమస్యలు పరిష్కరిస్తారు.
ప్రజాశక్తి : భూరీసర్వే ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి.. ?
ఆర్‌డిఒ: ఎప్పడో నిర్ణయించిన సరిహద్దులు, భాగపరిష్కారాలు, ఆక్రమణలు ఇలా భూముల విషయంలో అనేక తగాదాలున్నాయి. ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో భూరీసర్వేకు పూనుకోవడం వల్ల ఎవ్వరి భూమి ఎంత ఉందనే విషయంతో పాటు ఫారెస్టు, ప్రభుత్వ భూములు ఇతర భూముల వివరాలు స్పష్టంగా గుర్తించే అవకాశముంది. తమభూమి ఎంతో తెలియక తికమక పడుతున్న వారికి ప్రభుత్వం పక్కాగా మీ భూమి ఇంత ఉందని లెక్కలతో సహా అందించడం జరుగుతుంది.
ప్రజాశక్తి: భూ రీసర్వేపై మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు..
ఆర్‌డిఒ: మంచి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అన్నదమ్ముల భాగపరిష్కారాలు, డెత్ కేసుల్లో మరణించిన వారిపై ఉన్న డాక్యూమెంట్లు మార్చుకోచుకొనే అవకాశముంది. కోర్టులో ఉన్న తగాదాలు మినహా మిగిలిన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఇదో మంచి అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలి.










