Sep 01,2022 21:54

రీసర్వేను వేగవంతం చేయండి
సీసీఎల్‌ఏ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీసీఎల్‌ఏ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ అన్నారు. గురువారం కార్యదర్శులు సాయిప్రసాద్‌, సిద్ధార్థ జైన్‌, బాబు అహ్మద్‌లు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిప్రసాద్‌ మాట్లాడుతూ రీసర్వే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరును సంబంధిత డిఐలు రోజువారి రివ్యూ చేయాలని, జాయింట్‌ కలెక్టర్‌లు వారానికోసారి, జిల్లా కలెక్టర్‌లు రివ్యూ చేయాలన్నారు. అక్టోబర్‌ రెండు నాటికి నిర్ణయించిన మేరకు 13 నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం డ్రోన్‌సర్వే పూర్తి అయిన ఓఆర్‌ఐసీట్లు వేగవంతంగా వస్తున్నాయని క్షేత్రస్థాయి పరిశీలన ఖచ్చితత్వంగా చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని, అలా జరిగితే తగుచర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. అలాగే మ్యుటేషన్‌ కార్యక్రమాలు 100శాతం పూర్తిచేయాలని క్షేత్రస్థాయిలో అవి పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్లు తమ వద్దకు ఫైళ్లను తెప్పించుకొని పర్యవేక్షించాలన్నారు. పిఓఎల్‌ఆర్‌ పనులు కూడా పూర్తిచేసి రీసర్వేకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా సిసిఎల్‌ఏ కార్యదర్శి 22ఏకి సంబంధించి మాట్లాడుతూ ఈపనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం తగదని జనవరి 2018 నాటి నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి చూడాలని హైకోర్టు ఆదేశాలను సమయం ప్రకారం అమలు చేసేలా చూడాలన్నారు. అలా కాకపోతే రాష్ట్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని సక్రమంగా పరిష్కారం చేయకుంటే వారి మీద తగుచర్యలు తీసుకోబడుతుందని అన్నారు. కేసులు పరిష్కారం కోసం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని దాని ద్వారా సత్వరం కేసులు పరిష్కారం చేసుకునేలా చూడాలన్నారు. అర్హత ఉన్నవారికి ఇంటి పట్టాలు సకాలంలో మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.