రీసర్వే పనులను పూర్తి చేయండి: కలెక్టర్
ప్రజాశక్తి- పలమనేరు: ఏళ్ల తరబడి ఉన్న భూవివాదాలను పరిష్కరించేందుకు చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పలమనేరు రూరల్ మండలం మొర్రంగ్రామం రామాపురంలో జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించి ఈపనులకు సంబంధించిన విషయాలను రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈకార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని తద్వారా భూసమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. భూవివాదాలు పరిష్కరించేందుకు సమగ్ర సర్వే చేసే రీసర్వే కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరమని రైతులకు కలెక్టర్‌కి తెలిపారు. మొర్రంగ్రామం రామాపురంలో నక్కపల్లి చెరువు మీద వంతెన నిర్మించాలని రైతులు కలెక్టర్‌ను కోరగా ఈ అంశమును పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం టి.వడ్డూరు హౌసింగ్ లేఔట్‌ను పరిశీలించారు. ఈలేఔట్ నందు మంజూరైన 51ఇండ్లకు గాను, 30 బిఎల్‌స్థాయిలో, ఆర్‌ఎల్ 8, ఆర్‌సి 6, పూర్తిఅయినవి 7 ఇండ్లు అని డీఈ రమేష్‌రెడ్డి కలెక్టర్‌కి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం టి.వడ్డూరు గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్ల హాజరు శాతం తక్కువగా ఉందని గమనించిన జిల్లా కలెక్టర్ వాలంటీర్లు వారంలో మూడు రోజులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేసేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓకు సూచించారు. కోవిడ్ ప్రికాషనరీ వాక్సినేషన్‌ను అర్హులందరికీ వేసి పూర్తిచేయాలని, హైరిస్క్ ప్రెగెన్సీ కలిగిన మహిళలకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కుప్పస్వామి, ఎంపిడిఓ విద్యాసాగర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










