Aug 17,2023 22:05

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌, డైరెక్టర్‌ పి.కోటేశ్వరరావు

         అనంతపురం కలెక్టరేట్‌ : భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనిని పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌, డైరెక్టర్‌ పి.కోటేశ్వరరావు మున్సిపల్‌ అధికారులు, సచివాలయ సిబ్బందికి సూచించారు. గురువారం అనంతపురం నగరంలోని ఎస్‌జెఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద రీసర్వేపై అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలకు చెందిన వార్డు రెవెన్యూ కార్యదర్శులు, అభివద్ధి, ప్లానింగ్‌ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ గౌతమితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చిలోపు రీసర్వే పూర్తీ చేసి యజమానులకు భూ హక్కు పత్రాలను అందిస్తామన్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి రీసర్వేను విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్‌ గౌతమి మాట్లాడుతూ రీ సర్వే ముఖ్య ఉద్ధేశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని, ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు రీసర్వేను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు. మునిసిపల్‌ ఆర్డీ పీవీవీఎస్‌ మూర్తి, నగర పాలక సంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎస్‌ఒపి ఆధారంగానే రీ సర్వే చేయాలన్నారు. అడ్మిన్‌ సెక్రటరీలు పూర్తిస్థాయిలో ఈ రీసర్వేలో పాలుపంచుకోవాలన్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌ సుబ్బారావు రీసర్వేకు సంబందించిన 23 రకాల అంశాలను కార్యదర్శులకు కూలంకషంగా తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ రమణారెడ్డి, మున్సిపాలిటీల కమిషనర్‌లు, అడ్మినిస్ట్రేటివ్‌, ప్లానింగ్‌, సచివాలయ రెవెన్యూ కార్యదర్శులు పాల్గొన్నారు.