ప్రజాశక్తి - ఆచంట
దశాబ్ధాల నాటి భూ సమస్యలకు జగనన్న భూ హక్కు, భూ రక్ష, రీ సర్వేతో మోక్షం కలుగుతుందని సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షులు సుంకర సీతారామ్ అన్నారు. ఆదివారం కొడమంచిలిలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డోన్ కెమెరాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీ సర్వేను చేపట్టి ఎటువంటి వివాదాలు లేని భూములను రైతులకు భూ యజమానులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. దీంతో దశాబ్ధాల నాటి భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల దశాబ్ధాల కల సహకారం అవుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భూముల రీ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా పారదర్శకంగా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రీ సర్వేలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సర్వేకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహశీల్దార్ రాజ్యలక్ష్మి, విఆర్‌ఒలు సీతారాం, సూర్యనారాయణ నరసింహరాజు, రాజబాబు పాల్గొన్నారు.










