Aug 21,2023 21:57

రఘువీరారెడ్డి

         అనంతపురం ప్రతినిధి : మాజీ పిసిసి అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి చూపు కర్నాటక రాజకీయాల వైపు మళ్లిందా అన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్నాటక నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది. కర్నాటక రాజకీయాల్లోనూ చర్చ నడుస్తున్నట్టు అక్కడి మీడియా కథనాలు కూడా రావడం బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని ఆయన పాల్గొన్నారు. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయాలు సైతం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, అనంతపురం జిల్లాలోనూ ఎన్‌.రఘువీరారెడ్డికి ప్రత్యేకమైన స్థానముంది. మూడు పర్యాయాలు మంత్రిగానూ పనిచేశారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతపురం జిల్లాపైనా ఆయనకు ప్రత్యేకమైన స్థానముంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెసు పార్టీ పూర్తిగా దెబ్బతింది. ఈ సమయంలోనూ ఆయన పిసిసి అధ్యక్ష బాధ్యతలను చేపట్టి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సాయశక్తుల కృషి చేశారు. కాని 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెసు పార్టీలో మెరుగుదల కనిపించలేదు. అప్పటి నుంచి పిసిసి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. స్వగ్రామానికే పరిమితమయ్యారు. ఆయన ఊరు నీలకంఠాపురంలో దేవాలయాల నిర్మాణాలు చేపడుతూ పూర్తిగా ఆధ్యాత్మిక మార్గం వైపు నడిచారు. ఇక రాజకీయాలకు దూరమైనట్టే అన్న భావన సైతం అందరిలోనూ నెలకొంది. అయితే తిరిగి కాంగ్రెసు జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ దేశ్‌ జోడో యాత్ర సమయంలో ఆయనతోపాటు కలసి ఆంధ్రప్రదేశ్‌లోని డీ.హీరేహల్‌ ప్రాంతంలో పాల్గొన్నారు. అనంతరం ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నారు. తుముకూరు ప్రాంతంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ కాంగ్రెస్‌కు మంచి ఆధిక్యత కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అక్కడి నుంచి బరిలో దింపితే ఎలాగుంటుందన్న ఆలోచనలో ఆ పార్టీ వర్గాల్లో సాగుతున్నట్టు సమాచారం. ఈ ప్రచారంతో ఆయన ఇప్పటి వరకు ఉన్న మౌనం వీడి ఇక క్రీయాశీలకంగా మారుతారా అన్నది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటి వరకు ఆయన పార్టీ మారుతారా అన్న ప్రచారానికి తెరపటినట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో అటు టిడిపిగాని, ఇటు వైసిపిగాని చేరుతారన్న ప్రచారం ఇక్కడ సాగింది. కాని అందుకు భిన్నంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీలోనే పక్క రాష్ట్రం వైపు మొగ్గుపుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు సిడబ్లుసి శాశ్వత సభ్యుడిగానూ నియమించింది. దీన్నిబట్టి కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆయనకు ఏ మేరకు ప్రాధాన్యతనిస్తోందన్నది స్పష్టమవుతోంది. జాతీయ స్థాయిలో కీలకమైన కమిటీలో చోటు కల్పించడం మరింత ప్రాధాన్యత కల్పించినట్టయింది. కర్నాటక కాంగ్రెసు రాజకీయాల్లోనూ ఆయన క్రీయాశీలకంగా మారే అవకాశాలున్నట్టు రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.