Nov 17,2022 21:55

'రెవెన్యూ'లో అవినీతి జలగలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

రెవెన్యూలోని లంచావతారుల నిజస్వరూపం సోషియల్‌ మీడియా పుణ్యమా అంటూ వెలుగు చూస్తున్నాయి. స్వయంగా తహశీల్దారే పట్టాదారు పాసుపుస్తకం ఆన్‌లైన్‌లో నమోదు కోసం రూ.5వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యేండ్‌గా బుక్కుయ్యారు. రెవెన్యూలో చోటు చేసుకుంటున్న అవినీతికి సాక్షంగా నిలించింది. స్వయంగా జిల్లా కలెక్టర్‌ స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించాల్సి వచ్చింది. చివరకు పెనుమూరు తహశీల్దార్‌ రమణిని విధుల నుండీ తొలగించి సస్పెండ్‌ చేశారు.
పెనుమూరుకు ఇన్‌చార్జి తహశీల్దార్‌గా పూతలపట్లు తహశీల్దార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సోషియల్‌ మీడియాలో హల్‌ఛల్‌ చేసిన ఈవీడియో రెవెన్యూ శాఖలో ఏ స్థాయిలో లంచావతారులు పెట్రోగిపోతున్నారడానికి నిలువెత్తు సాక్షం. ఇటీవల జిల్లా సంచలనం రేపిన అక్రమ భూరిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఓ తహశీల్దార్‌తో పాటు ఇద్దరు విఆర్‌ఓలు సస్పెండ్‌ అయ్యారు. ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. అక్రమ భూరిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కోట్లరూపాయలు రెవెన్యూ అధికారులకు ముట్టిన్నట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ముద్దాయిలు కోర్టువిచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా గురువారం జీడి నెల్లూరు తహశీల్దార్‌ కార్యాలయంలోనే డిప్యూటీ తహశీల్దార్‌ కిషోర్‌ తనవద్ద ఏకంగా లక్షా డెబైవేలు తీసుకున్నాడంటూ విఆర్‌ఒ దొరస్వామి బండబుతులు తిడుతూ గొడవకు దిగారు. తన బదిలీ రద్దు చేస్తానంటూ కోరిన చోట పోస్టీంగ్‌ ఇప్పిస్తానంటూ జీడి నెల్లూరు డిప్యూటీ తహశీల్దార్‌ రూ.1,70,000వేలు డిమాండ్‌ చేస్తే ఫోన్‌పే ద్వారా ఇచ్చానని విఆర్‌ఒ దొరస్వామి ఆరోపిస్తున్నారు.
జిల్లాలో ఇటీవల రెవెన్యూ శాఖలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలతో రెవెన్యూ శాఖలో ఏస్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందో చెప్పకనే చెబుతున్నాయి. ఒక్క పెనుమూరు, జీడినెల్లూరే కాదు జిల్లా అంతగా ఇదే పరిస్థితి. ఏ తహశీల్దార్‌ కార్యాలయంలోనైనా చిన్నపాటి సంతకానికి వందో రెండు వందలో సమర్పించు కోవాల్సిందే.... ఇక ఆన్‌లైన్‌లో భూమినమోదు, భూముల సర్వే కోసం వేలాది రూపాయులు లంచంతో ఇచ్చేకోవాల్సందే అంటున్నారు. ఉదయం నుండీ ప్రశాతంగా అర్జీదార్లలో నిండిపోయే తహశీల్దార్‌ కార్యాలయాల్లో సాయంత్రం ఆరు గంటల తరువాత బిజీబిజీగా ఉంటున్నాయి. అసలు తతంగం నడిచేది ఈ సమయంలోనే... సెటిల్మెంట్లు, బేరాలు, పంపకాలు సాయం ఆరు గంటలపైనే.... కొన్ని తహశీల్దార్‌ కార్యాలయాలు ఆరు గంటల తరువాత ఫైల్స్‌ వెరిఫికేషన్‌ పేరుతో తలుపులకు గడి వేసుకొని ఈ తంతు నడుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ రెవెన్యూశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి పెట్రోగిపోతున్న రెవెన్యూ అధికారుల అడగాలను అరికట్టకుంటే మరింతగా రెవెన్యూ వ్యవస్థ భ్రష్టుపట్టిన రెవెన్యూ కార్యాలయాకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంటుందని స్థానికులు వాపోతున్నారు.