May 02,2023 09:51

అర్జీదారునితో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి

         అనంతపురం కలెక్టరేట్‌ : స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నాయని, వీటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ గౌతమి సూచించారు. సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమం అనంతరం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, సహాయ కలెక్టర్‌ ఎస్‌.ప్రశాంత్‌ కుమార్‌, డిఅర్‌ఓ గాయత్రిదేవి , అన్సెట్‌ సిఈఓ కేశవ నాయుడు, ఆర్డీవో మధుసూదన్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ కార్యాలయాలకు విచ్చేసి అర్జీలను సమర్పిస్తూ ఉంటారన్నారు. అలాంటి అర్జీదారుల పట్ల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. 24 గంటల నుంచి 48 గంటల్లోపు పరిష్కరించాల్సిన ఆర్జీలు నాలుగు ఉన్నాయని, అలాగే రీఓపెన్‌ చేయాల్సినవి 27 అర్జీలు ఉన్నాయని వాటిని వెంటనే రీఓపెన్‌ చేసి అర్జీలను పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. 36 గ్రీవెన్స్‌ లను ఇంకా ఓపెన్‌ చేయలేదని, సంబంధిత అధికారులు వాటిని ఓపెన్‌ చేసి పరిష్కరించాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యలకు సంబంధించిన అధికారులు ఆ సమస్యలపై తీసుకున్న చర్యలకు సంబంధించి ప్రతిసమస్య పరిష్కార తీరును పేర్కొంటూ నివేదికలను సిపిఓకు పంపాలన్నారు. జిల్లా అధికారులు సెలవులపై వెళ్తున్నప్పుడు మెసేజ్‌ చేసి వెళ్తున్నారన్నారు. ఇకపై సెలవుపై వెళ్లే అధికారులు 24 గంటలు ముందే నిర్ణీత దరఖాస్తులో పంపాలన్నారు. జగనన్నకు చెబుతాం కార్యక్రమంపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు.