రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజాశక్తి-కొడవలూరు : రెవెన్యూ సమస్యలు త్వరగా పరిష్కరించేందుకే జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణ్ స్పష్టం చేశారు. కొడవలూరు మండల కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. అందులో భాగంగానే స్పందన కార్యక్రమాన్ని మెరుగుపరిచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందని, 2019 నుంచి స్పందన కార్యక్రమం అమలు చేయడం జరుగుతోందన్నారు. దానిని పూర్తిస్థాయిలో మెరుగు పరచి ఈ యేడాది మే తొమ్మిదో తేదీ నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాల వారు జిల్లా కేంద్రానికి వచ్చి వినతులు సమర్పించేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. వీరు ఇబ్బందులను తొలగించేందుకే మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జిల్లాలో బుధ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో వచ్చిన అర్జీలను నేరుగా సిఎం కార్యాలయం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే ప్రతి వినతిని సిఎం కార్యాలయం స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి సమస్యను పరీక్షించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని సమస్యలు సచివాలయ ద్వారానే పరిష్కరిస్తున్నట్లు, రెవెన్యూ సమస్యల పరిష్కారం ప్రధాన ఉద్దేశంతో జగనన్నకు చెబుదాంతో అమలు జరుగుతుందన్నారు. ఈ మేరకు నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 75 వినతులు వచ్చాయని తెలిపారు. మండలంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు తెలియడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బృహత్తర కార్యక్రమం జగనన్నకు చెబుదాం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వారి సమస్యలకు పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జెసి ఆర్.కూర్మనాథ్, డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, జెడ్‌పి సిఇఒ బి.చిరంజీవి, ఆర్‌డిఒ శివ నాయక్, డిఆర్‌డిఎ పిడి సాంబశివారెడ్డి, ఇసి బాపిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్ రెడ్డి, తహశీల్దార్ రమాదేవి, ఎంపిడిఒ పి.సుబ్రహ్మణ్యం, సర్పంచ్‌లు కామాక్షి, సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.










