Mar 27,2023 22:43

సిపిఎం ఆధ్యర్యంలో ధర్నా చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి గుంతకల్లు       వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు ఎద్దడి లేకుండా రెండు రోజులకు ఒకసారి అయినా నీరు అందించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట పలు కాలనీల మహిళలు సిపిఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు మాట్లాడుతూ.. పట్టణంలో మున్సిపల్‌ అధికారులు సమయ పాలన లేకుండా నాలుగు రోజులకు ఒకసారి అదీ అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున తాగునీరు వదులుతున్నారని అన్నారు. నీరు ఏ సమయానికి వస్తుందో అర్థం కాక ప్రజలు డబ్బులు చెల్లించి ప్రయివేటు ట్యాంకర్లతో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రధానంగా పట్టణ శివారు ప్రాంతాలైన సీఐటీయూ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎర్ర చెరువు, కాలనీ, సంతోష్‌ నగర్‌, బెస్త కాలనీ, పట్టణంలో అనేక చోట్ల ప్రజలు నీరు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొన్ని ప్రాంతాలలో పైప్‌లైన్‌ ఉన్నప్పుడు ఒక కొళాయి నుంచి నీరు వస్తుంటే మరొక కొళాయికి నీరు రాని పరిస్థితి కూడా ఉందన్నారు. వాటికి మరమ్మతులు చేసి ప్రజలకు వేసవి కాలంలో నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వార్డుల్లో పర్యటించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్‌ హామీ ఇవ్వడంతో నాయకులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, మారుతి ప్రసాద్‌, జగ్గలి రమేష్‌, కసాపురం రమేష్‌, సాకే నాగరాజు, రంగమ్మ, పట్టణ కమిటీ సభ్యులు రాము నాయక్‌, అబ్దుల్లా, ఓబులేసు, చంద్ర పట్టణ మహిళలు పాల్గొన్నారు.