Sep 16,2023 23:15

చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న కమిషనర్‌ ఎం.ఎం నాయక్‌

* చేనేత జౌళిశాఖ కమిషనర్‌ ఎం.ఎం నాయక్‌
ప్రజాశక్తి - పొందూరు: 
ఫ్రేమ్‌లూమ్‌ మీద జాక్వార్‌ ఫాబ్రిక్‌తో అధునాతన చీరలు నేసేందుకు అవసరమైన శిక్షణను చేనేత కార్మికులకు అందించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ ఎం.ఎం నాయక్‌ అన్నారు. పొందూరు పట్టణంలో సాయిబాబా చేనేత సొసైటీని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 74 చేనేత క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు. ఫిట్‌లూమ్‌ నుంచి ప్రస్త్రమ్‌ లూమ్‌కు కార్మికులు అప్‌డేట్‌ కావాలన్నారు. పొందూరులో నూతనంగా ఏర్పాటు చేసిన చేనేత క్లస్టర్‌కు అవసరమైన అన్ని పరికరాలను రెండు నెలల్లో సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పొందూరులో ఖాదీ, చేనేత కార్మికులు చాలా నైపుణ్యం గల వారని, వారికి దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్నారు. సొసైటీలు బలపడాలంటే సభ్యత్వం పెరగాలని, తద్వారా ఉత్పత్పి పెరిగి అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ప్రస్తుతం ఉన్న చేనేత వస్త్రాల టర్నోవర్‌ను రెండింతలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేనేత వస్త్రాల విక్రయం రిబేటు బకాయిల సుమారు రూ.3.96 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని సాయిబాబా చేనేత సొసైటీ మేనేజర్‌ వట్టం శ్రీనివాసరావు తెలిపారు. క్లస్టర్‌ బిల్డింగ్‌ పూర్తయి నాలుగేళ్లయినా వినియోగంలోకి రాలేదని, పరికరాలు ఇవ్వలేదని పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబందించిన వివరాలు ఇవ్వాలని ఎడి ఐ.ధర్మారావుకు ఆదేశించారు. 50 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు అందుతున్నాయని అడగ్గా, ఎం.గవర్రాజు తనకు ఫించన్‌ రావడం లేదని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మంజూరు కావడం లేదని తెలిపారు. అనంతరం సొసైటీలోని చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఈయనతో పాటు ఎడి ధర్మారావు, డిఒ శేఖర్‌, ఆప్కో డిఎం సోమేశ్వరరావు, సంఘం డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.