May 11,2023 22:02

బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడుతున్న ఎపి రైతుసంఘం నాయకులు

ప్రజాశక్తి-శింగనమల   అసలు, వడ్డీ కట్టించుకోకుండా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు పెంచి రెన్యువల్‌ చేయాలని ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగరాజు డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం మండల పరిధిలోని తరిమెల గ్రామంలో ఉన్న అనంత గ్రామీణ బ్యాంకు ముందు ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో చోటు చేసుక్ను అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు పూర్తిస్థాయిలో పంటలు నష్టపోయారన్నారు. దీంతో అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పంట బీమాగానీ, ప్రభుత్వం నుంచి నష్టపరిహారంగానీ అందలేదన్నారు. ఈనేపథ్యంలో అసలు, వడ్డీ కట్టి పంట రుణాలు రెన్యువల్‌ చేయాలంటే రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నారు. కావున స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పెంచి రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే బ్యాంకుల వద్ద తాగునీరు, నీడ ఏర్పాటు చేయాలని, అడంగల్‌ లేకుండా 1బి ఆధారంగా రుణాలు రెన్యువల్‌ చేయాలని, రుణమాఫీ కింద మూడవ విడత మహిళలకు ఆసరా పథకం ద్వారా వేసిన డబ్బులు మహిళల ఖాతాలోకి జమ చేయాలని, జామీదారుడు వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్‌ యాదవ్‌, గంపమల్లయ్య, సూర్యప్రకాష్‌, గిరి, మేకల పెద్దన్న, కొండారెడ్డి, ఆంజనేయులు, జయరాముడు, శ్రీనివాసులు, ఆవుల రామాంజనేయులు, సుంకన్న, వరలక్ష్మి, నాగరాజు, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
గార్లదిన్నె :
ఎలాంటి అసలు, వడ్డీ కట్టించుకోకుండా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పెంచి రైతు రుణాలు రెన్యువల్‌ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు మేనేజర్‌కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చెన్నారెడ్డి మాట్లాడుతూ రైతుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసలు, వడ్డీ కట్టించుకోకుండా రుణాలు రెన్యువల్‌ చేసేందుకు బ్యాంకు సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు నాగమ్మ, నల్లప్ప, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.