
ప్రజాశక్తి - మందస: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఈనెల 16వ తేదీన మంత్రి అప్పలరాజుకు రాయబారం కార్యక్రమం చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని హరిపురంలో రాయబారం పోస్టర్లను గురువారం పంపిణీ చేస్తూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్ఫేర్ బోర్డును పూర్తిగా మూసేశారని చెప్పారు. 1996లో కేంద్రం చేసిన వెల్ఫేర్ చట్టంలో అనేక అంశాలున్నా, కొన్ని మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తెలిపారు. ఉన్న కొన్నింటినీ ఆపేస్తే కార్మికుల సంక్షేమం సంగతి ఏంటని ప్రశ్నించారు. వృద్ధాప్యంలో పింఛను ఇవ్వాలని చట్టంలో ఉందని, దీన్ని కలుపుకొని మిగతా బెనిఫిట్స్ అమలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కె.కొక్లే, బలరాం, మేస్త్రీలు దుర్యోధన, సోమేశ్వర, దానయ్య, కుర్మారావు తదితరులు పాల్గొన్నారు.