
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: వర్షాభావ పరిస్థితులకు తోడు వంశధార నదిలో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో భైరిదేశి గెడ్డకు నీరు రాక పంట పొలాలకు సాగునీరందక రైతులు అవస్థలు పడుతున్నారని టిడిపి నాయకులు, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు జిల్లా గొండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండపంలోని పొన్నాం వద్ద ఉన్న భైరిదేశిగెడ్డను శనివారం టిడిపి నాయకులు, రైతులు సందర్శించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులపై చిన్నచూపు చూస్తోందని, సాగునీరందక వేలాది ఎకరాల పంటలు ఎండిపోయి బీడు భూములుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార నదిలో పుష్కలంగా నీరు ఉన్నా అధికారులు వేలాది క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృథా విడిచి పెడుతున్నారని అన్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గతంలో ఈ ప్రాంతంలో పర్యటించారని, అయినా రైతుల సమస్యలు పరిష్కారించడంలో పట్టించు కోలేదని విమర్శించారు. వేలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా పోతుంటే నీటిపారుదల శాఖ మంత్రిగా చెప్పుకునే మల్లెపూల మంత్రి అంబటి రాంబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మంత్రులు వాస్తవాలు మరిచి రైతులను మభ్య పెట్టే మాటలు మానుకోవాలని హితవుపలికారు. భైరిదేశి గెడ్డ ఓపెన్ హెడ్ ఛానల్ దగ్గర నీటిని అడ్డుకట్ట వేయకుండా ఆప్రాంతంలోనే ఇసుకదం దా చేస్తున్నారని విమర్శించారు. హెడ్ స్లూయిస్ మొదలు ప్రధాన కాలువ ఉన్న అంబళ్లవలస, తంగుళ్లపేట, గార, కొర్ని, కొర్లం, తొంనగి, వమరవిల్లి, కళింగపట్నం గ్రామాల రైతులకు నీరు అందడం లేదన్నారు. కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ మూకళ్ల శ్రీను, శాలిహుండం సర్పంచ్ కొంక్యన ఆదినారాయణ, మండల తెలుగు యువత ప్రెసిడెంట్ గురువు లక్ష్మణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కంచు దశరథ, గార మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకట రమణమూర్తి, భైరి మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, భైరివానిపేట సర్పంచ్ భైరి నరేష్, తండెంవలస ఎంపిటిసి మాజీ సభ్యులు అంబటి వైకుంఠం, బడగల వెంకటప్పరావు పాల్గొన్నారు.