అనంతపురం ప్రతినిధి : టిడిపి అధికారంలోకి రాగానే అన్ని విధాలా వారికి తోడుగా ఉంటామని, వ్యవసాయానికి సాయం అందిస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీనిచ్చారు. యువగళం పాదయాత్ర 64వ రోజు శనివారం నాడు పాదయాత్రకు విరామం ఇచ్చారు. గార్లదిన్నె మండలం జంబులదిన్నె వద్ద 'రైతన్నతో లోకేశ్' పేరుతో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌కెయు ప్రొఫెసర్ రాంప్రసాద్ హోస్టుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు అడిగిన పలు ప్రశ్నాలకు లోకేష్ సమాధానం చెప్పారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ వైసిపి ప్రభుత్వ వైఫల్యాలతోపాటు, తాము అధికారంలోకి వస్తే తీసుకోబోయే చర్యలను వివరించారు. వైసిపి అధికారంలోకి రాక ముందు అంటే 2019 కంటే ముందు తలసరి రైతు రుణం రూ.70 వేలు ఉంటే ఇప్పుడు అది రూ.2.50 లక్షలకు చేరిందన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెబుతున్న వైసిపి ప్రభుత్వ మాటలు ఒట్టి బూటకమన్నారు. పంటలబీమాను ప్రభుత్వమే కంపెనీని స్థాపించి ప్రకృతి వైపరిత్యాలతో పంటనష్టపోయిన రైతులను ఆదుకుంటమని చెబుతోంది, కాని ఆచరణలో అది ఎక్కడా అమలు జరగలేదన్నారు. అనంతపురం జిల్లాలో ఇటీవలి కాలంలో తుఫానుతో ఉద్యానవన రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. వారిని ఆదుకునే అంశంపై ఇప్పటి వరకు నిర్ధిష్టమైన ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. పంటనష్ట పరిహారం చెల్లించే విషయంలోనూ ఈ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వైసిపికి అనుకూలంగానున్న కొద్ది మందికి పరిహారం ఇచ్చిన తక్కిన వారికివ్వడం లేదని విమర్శించారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడవ స్థానంలో ఉందన్నారు. కౌలు రైతు ఆత్మహత్యల్లో అయితే రెండవ స్థానంలో ఉందన్నారు. కౌలు రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరిసోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సాధారణ రైతులతో సమానంగా కౌలు రైతులను ఆదుకుంటుందని భరోసానిచ్చారు. రైతులను ఆదుకుంటామని ఈ ప్రభ్తుత్వర ఆర్బాటంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిందని గుర్తు చేశారు. తాను పాదయాత్ర చేసిన ఇన్ని రోజుల్లో ఎక్కడా రైతు భరోసా కేంద్రం తెరచి ఉన్న దాఖలాల్లేవని అన్నారు. మద్యం దుకాణాలు మాత్రం ఎప్పుడూ తెరచి ఉంటాయని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రైతులను ఏ రకంగా ఆదుకుంటారని రైతులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలను పెంచి పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తామని, మార్కెటింగ్‌ను అనుసంధానం చేసి గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు చేపడామన్నారు. ఉద్యావన పంటలు అధికంగానున్న చోట ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి ఉండగా రూ.11 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినట్టు వివరించారు. వీరు వచ్చాక బిందు, తుంపెర సేద్యాన్ని అటకెక్కించారని విమర్శించారు. టిడిపి హయాంలో పెద్దఎత్తున బిందు,తుంపెర సేద్య పరికరాలను సబ్సిడీకి అందించామని, రాబోయే రోజుల్లోనూ ఇది కొనసాగుతుందన్నారు. వ్యవసాయ అనుబంద రంగమైన పాడి పరిశ్రమ అభివృద్ధికి గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ మంత్రుల కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారథి, బండారు శ్రావణి, ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నర్సానాయుడుతోపాటు వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.










