అనంతపురం ప్రతినిధి : 'ఒకవైపు వరదలు, మరోవైపు కరువు పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.. రెండు విధాలుగానూ రైతులు నష్టపోయారు.. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించి వారిని ఆదుకోవాలి'.. అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని గణేనాయక్ భవనంలో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వరదలు, కరువు పరిస్థితులతో రెండు రకాలుగా రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇందులో ప్రధానంగా కౌలు రైతులున్నారని తెలిపారు. పంటలు చేతికందక రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్త ం చేశారు. 2018 , 2019 కంటే 2020లో కొంత వరకు రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినప్పటికీ 2021, 2022, 2023లో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వమిస్తున్న ఏడు లక్షల పరిహారం కూడా సక్రమంగా అందటం లేదని తెలిపారు. ఏదోక కారణాలతో రైతు ఆత్మహత్య కింద నమోదు చేయకపోవడంతో ఈ నష్టం జరుగుతోందన్నారు. తెలంగాణ తరహాలో రైతు ఏ రూపంలో చనిపోయినా ఐదు లక్షలు పరిహారం అందిస్తున్నట్టుగా ఇక్కడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరిత్యాలతో పంటనష్టపోతే వచ్చే పంటలబీమా మొత్తం లోపభూయిష్టంగా ఉందన్నారు. ఇది కూడా ప్రయివేటు బీమా కంపెనీలకు లాభం చేకూర్చేదిగా ఉందని విమర్శించారు. ఈ బీమా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పంటలబీమాలో కంపెనీలకు లక్షల కోట్లు ప్రీమియం కడితే రైతులకు పరిహారంగా ఇచ్చింది రూ.700 కోట్లు మాత్రమేనని చెప్పారు. అందుకే పంటలబీమా విధానంలో రైతుకు లాభం చేకూర్చే విధానాన్ని తీసుకురావాలిని డిమాండ్ చేశారు. రుణమాఫీని రైతులు, కౌలు రైతులకు కూడా వర్తించే విధంగా అమలు చేయాలని సూచించారు.
పార్లమెంట్‌లో మౌనం...ఇక్కడ అనుకూలమైన ప్రకటనలు
మణిఫూర్ ఘటనపై పార్లమెంటులో విపక్ష పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపిలు మౌనంగా ఉంటున్నాయని వి.శ్రీనివాసరావు విమర్శించారు. అక్కడ మట్లాడకుండా ఇక్కడికొచ్చి మీకు అండగా ఉంటామని చెప్పడం మోసకారితనమే అవుతుందని దుయ్యబట్టారు. మణిపూర్‌లో మహిళలపై పెద్దఎత్తున హింస జరిగిందని తెలుస్తున్నా ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు.. జనసేన పార్టీ కూడా మణిపూర్ ఘటనపై కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ పాల్గొన్నారు.










