Jun 14,2022 22:19

జిల్లాలో ఖరీఫ్‌ 2021 సంవత్సరానికి 57,450 మంది
రైతులకు రూ.26.13 కోట్లు లబ్ధి : ఎంపి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:

పంట నష్టపోయిన అన్నదాతలకు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంను మంగళవారం వర్చువల్‌ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీసత్యసాయి జిల్లా సికెపల్లి నుండి బటన్‌ నొక్కి ప్రారంభించారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం జిల్లాస్థాయి కార్యక్రమం చిత్తూరు నాగయ్యకళాక్షేత్రంలో జరగగా ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్‌.రెడ్డప్ప, జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పాలఏకిరి కార్పొరేషన్‌ చైర్మన్‌ మురళీధర్‌, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్‌ అముద, ఐఒరాల జడ్పీటిసి సుజాత పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంపి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సంక్షేమంకు పెద్దపీట వేశారని, రైతు సంక్షేమంలో భాగంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఖరీఫ్‌కు ముందుగానే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగుకు అవసరమైన యంత్రపరికరాలతోపాటు ఆర్థిక సహాయంను ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. సకాలంలో వర్షాలు పడడంతో లాభసాటి వ్యవసాయం దిశగా రైతులకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రకతి వైఫల్యాల వల్ల పంటనష్టపోయిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంను ప్రవేశపెట్టిందని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ఆర్‌బికెల ద్వారా వ్యవసాయ, ఉద్యానశాఖకు చెందిన సిబ్బంది రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడం జరుగుతున్నదన్నారు. ఖరీఫ్‌సీజన్‌ ప్రారంభం కాగానే సబ్సిడీతో విత్తనాలు, రైతు భరోసా పధకం కింద ఆర్థిక సహాయం, యాంత్రీకరణలో భాగంగా వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం కింద ట్రాక్టర్‌లు పంపిణీ చేయడం జరుగుతున్నదని, నేడు మరో పథకం అయిన ఖరీఫ్‌ 2021కు సంబంధించి వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద రైతులకు లబ్ధి చేకూర్చడం జరుగుతున్నదని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి లాభసాటి వ్యవసాయ దిశగా చర్యలు చేపట్టారని తెలిపారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్‌బికెల ద్వారా అన్నదాతలకు అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నామని తెలిపారు. మేయర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్‌ 2021 సంవత్సరానికి సంబంధించి 57,450 మంది రైతులకు రూ.26.13 కోట్లు పంపిణీకి సంబంధించిన మెగా చెక్కును అతిధుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో చుడా చైర్మన్‌ పురుషోత్తమ్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీధర్‌, జెడ్‌పిటిసి ఈఓ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.