Oct 28,2023 22:08

ఫొటో : మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు

రైతులకు నిరంతర విద్యుత్‌ అందించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రైతులకు 9గంటల నిరంతర విద్యుత్‌ అందించాలని ఎపి రైతుం సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్‌ నెలాఖరు కావస్తున్నా, వర్షాలు లేక చెరువులు ఎండిపోతున్నాయన్నారు. సోమశిల డ్యామ్‌లోనూ అడుగంటిన పరిస్థితి నెలకొందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గమే కాకుండా రాష్ట వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం తప్ప మరొకటి తెలియని రైతాంగం, అక్కడక్కడా వరి పైరు వేసి సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పొగాకు రైతులు నార్లు పోసుకొని వర్షం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
కొంతమంది బోర్ల కింద పైర్లు వేసి ఖర్చైనా సరే పండించేందుకు పూనుకొన్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భాలలో ప్రభుత్వం ఆలోచించాల్సిన పద్ధతిలో ఆలోచించడం లేదన్నారు. రైతులు విపత్కర పరిస్థితులలో పండిస్తున్న పరిస్థితులలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా 9గంటలు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వడంలో విఫలం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉండగా కేవలం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 3:30 వరకు మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారన్నారు. సాగునీరు సహజంగా అందని పరిస్థితులలో ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసే విధంగా ఆత్మకూరు డివిజన్‌ విద్యుత్‌ అధికారులు చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎపి రైతుసంఘం, కౌలు రైతుసంఘం నాయకులు గంటా లకీëపతి, పాపిసెట్టి కృష్ణమోహన్‌, లక్కు కృష్ణ ప్రసాద్‌ ఉన్నారు.