ప్రజాశక్తి-ఉరవకొండ జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులందరూ సమన్వయం చేసుకుని రైతులకు అందుబాటులో ఉండటంతోపాటు మెరుగైన సేవలు అందించాలని జిల్లా వ్యవసాయాధికారిణి ఉమామహేశ్వరమ్మ సూచించారు. ఉరవకొండ డివిజన్ ఎడిఎ పద్మజ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఉరవకొండ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం చేపట్టిన 40శాతం సబ్సిడీ వేరుశనగ విత్తనాలను రైతులందరికీ సకాలంలో పంపిణీ చేయడంతో పాటు సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు వీలైనంత త్వరలో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గ్రామస్థాయిలో టెక్నికల్ సమస్యలు ఎదురైతే వెంటనే మండల జిల్లా స్థాయి అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే కౌలు పత్రాల గురించి, పీఎం కిసాన్, రైతు భరోసా పెండింగ్ రైతులతో త్వరగా ఇకెవైసి చేయించాలన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉరవకొండ డివిజన్ పరిధిలో చిరుధాన్యాల సాగు పెరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. చిరు ధాన్యాల సాగు చేయడానికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలు గురించి రైతులకు వివరించాలన్నారు. చిరుధాన్యాల సాగు పెరగడం వల్ల మానవ కోటికి మేలు చేసిన వారమవుతామన్నారు. అంతేగాకుండా రైతుల ఆదాయంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీసాయి ఆగ్రో ఏజెన్సీస్ పురుగు మందుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వం సర్టిఫై చేసిన విత్తనాలు, మందులను మాత్రమే విక్రయించాలన్నారు. అలాగే నిర్ధేశించిన ధరలకు కాకుండా అధిక ధరలకు ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ డివిజన్‌లోని వ్యవసాయ అధికారులు శుభకర్, పెన్నయ్య, మధుకర్, స్వాతి, సాంకేతిక వ్యవసాయ అధికారులు వెంకట్‌కుమార్, రాకేష్‌నాయక్, బాలానాయక్, డివిజన్ పరిధిలోని గ్రామ వ్యవసాయ, సిరికల్చర్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ










