అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా కషి చేస్తున్నారని, వారి సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సాగునీటి పథకం కింద రాయదుర్గం, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాలకు సంబంధించిన డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరి సాంబశివారెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, తదితరులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 71 మంది రైతులకు రూ.2.2 కోట్లు విలువజేసే డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 62 మంది రైతులకు రూ.82.5 లక్షలు విలువ చేసే స్ప్రింక్లర్ పరికరాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. శింగనమల నియోజకవర్గం పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 89 మంది రైతులకు రూ.2.5 కోట్ల విలువ చేసే డ్రిప్ పరికరాలను అందించినట్లు తెలిపారు. రైతులకు అన్ని రకాలుగా మంచి చేయడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతులు సబ్సిడీతో అందించిన డ్రిప్ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు అన్ని విధాల అండగా ఉంటున్నారన్నారు. రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందజేస్తోందని, పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిసిసి బ్యాంక్ ఛైర్‌పర్సన్ లిఖిత, ఉద్యాన శాఖ డిడి రఘునాథరెడ్డి, ఏపీఎంఐపి పీడీ ఫిరోజ్ ఖాన్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.










