అనంతపురం ప్రతినిధి :ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం రైతు భరోసాపై ప్రకటన చేసింది. ఈనెల 30వ తేదీన రైతు భరోసా కింద రూ.7500 ఒక్కో రైతు ఖాతాకు జమ చేయనుంది. ఈ మేరకు ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని కర్నూలు జిల్లాలో ప్రారంభించనున్నారు. ఇక్కడ జిల్లాలో మంత్రి ఉషశ్రీచరణ్ ప్రారంభించనున్నారు. జిల్లాలో ఎక్కడ ప్రారంభిస్తారన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంటుంది.
కాస్త ఊరట
మే నెలలో వర్షాలొస్తుండటంతో రైతులు దుక్కులు దున్ని భూములను సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాల పంపిణీకి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. అయితే చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాలు కూడా కొనలేక అవస్థలు పడుతున్నారు. మే నెలలో ప్రతి ఏటా ఇచ్చే రైతు భరోసాపైనా ప్రకటనలేకుండా ఉంది. ఇటువంటి సమయంలో శుక్రవారం నాడు ప్రభుత్వం రైతు భరోసా ఈనెల 30వ తేదీన ఇవ్వడానికి సిద్ధపడినట్టు ప్రకటన రావడంతో రైతులకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది. మొదటి విడత కింద ఇచ్చే రూ.7500 ఒక్కో రైతుకు ఇవ్వనున్నారు. దీంతో విత్తనాలు, దుక్కుల వరకైనా కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
అందనున్న రూ.158 కోట్లు
అనంతపురం జిల్లా వరకు చూస్తే 2,87,479 మంది రైతులు రైతు భరోసా కింద అర్హులుగానున్నారు. వీరందరికీ కలిపి మొత్తం రూ.158.74 కోట్లు రైతు భరోసా కింద జిల్లాకు రానున్నాయి. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా లబ్ధిదారుల జాబితాలు సైతం సిద్ధం చేసియున్నారు. నియోజకవర్గాల వారీగా సైతం జాబితాలు సిద్ధంగానున్నాయి. గుంతకల్లు నియోజకవరర్గం పరిధిలో మొత్తం 29381 మంద రైతులు ఉన్నారు. వీరికి రూ.16.15 కోట్లు. కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలో 53896 మంది రైతులకు రూ.29.64, రాప్తాడు నియోజకవర్గం పరిధిలో 24141 మంది రైతులకు రూ.13.27 కోట్లు, రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో రూ.44655 మంది రైతులకు రూ.24.56 కోట్లు, శింగనమల నియోజకవర్గం పరిధిలో 53635 మంది రైతులకు రూ.29.49 కోట్లు, తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో 31923 మంది రైతులకు రూ.17.55 కోట్లు, ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో 49848 మంది రైతులకు రూ.27.41 కోట్లు రైతు భరోసా కింద రైతులకు సహాయం అందనుంది.
నష్టపరిహారం కూడా అందితే...
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వరుసగా పడుతున్న వర్షాల, గాలుల వల్ల రైతులు పంటలు నష్టపోయి ఉన్నారు. ప్రకృతి వైపరిత్యాలతో దెబ్బతిన్న రైతులకు ఇంకా పరిహారం అందలేదు. ఈ పరిహారం కూడా సీజన్ ప్రారంభంలోపు అందితే రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. దీనిపై ఇంకా ప్రభుత్వం వైపు నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. ఇది కూడా ఇవ్వాలని నష్టపోయిన రైతులు కోరుతున్నారు.










