Aug 28,2022 23:12

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాశక్తి- పుంగనూరు:
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పనిచేస్తున్నారని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా డ్రిప్‌ పరికరాలు పంపిణీ కార్యక్రమంలో ఆదివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 92.14కోట్ల రూపాయలతో 9800 హెక్టార్లలో బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాల పంపిణీ చేయడం జరిగిందన్నారు. సబ్సిడీతో రైతులు పొందుతున్న డ్రిప్‌ఇరిగేషన్‌ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 91 మంది రైతులకు 175 ఎకరాలకు బిందు తుంపర్ల సేద్యం సంబంధిత పరికరాలను అందజేయడం జరుగుతుందన్నారు. పంటకు నీరు ఎక్కువైనా దిగుబడి రాదని అందుకే తగినంత నీరు అందించిందికే డ్రిప్‌ పరికారాల ఉపయోగపడతాయన్నారు. సన్న, చిన్న కారు రైతులకు గతంలో ఉన్న సీలింగ్‌ రూ.2లక్షల నుంచి రూ.2.18 లక్షలకు, ఐదు ఎకరాల పైన 10ఎకరాల లోపల ఉన్న రైతులకు గతంలో ఉన్న సీలింగ్‌ 2.8లక్షల నుంచి 3.46లక్షలకు పెంచడం జరిగిందన్నారు. బిందు తుంపర్ల సేద్య పరికరాల సరఫరాను రైతు భరోసా కేంద్రాల ద్వారా అత్యంత పారదర్శకంగా బయోమెట్రిక్‌, ఆధార్‌ అనుసంధానంతో అందజేయడం జరుగుతుందన్నారు. ఈపరికరాలను సరఫరా చేసేందుకు జిల్లాకు 24 మైక్రో ఇరిగేషన్‌ కంపెనీలను కేటాయించడం జరిగిందని రైతుల కోరుకున్న కంపెనీ పరికరాల తీసుకోవచ్చు నని తెలిపారు.
చిత్తూరు ఎంపి మాట్లాడుతూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు అవసరమైన డ్రిప్‌ పరికరాలను ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తుందని ఈ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడి సాధించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో భాగంగా పరికరాలు మంజూరైన రైతులకు ప్రొసీడింగ్స్‌ను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. టిటిడి బోర్డు సభ్యులు అశోక్‌ కుమార్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి మధు సూదన్‌ రెడ్డి, ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ముత్యంశెట్టి విశ్వనాథ్‌, రాష్ట్ర జానపద కళల అభివద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పలమనేరు, కుప్పం, మదనపల్లి అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి యాదవ్‌, ఎంపీపి భాస్కర్‌రెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసూన, వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్‌ నాగరాజు రెడ్డి, తహసీల్దార్‌ వెంకట్రాయలు, ఇంచార్జ్‌ ఎంపీడీఓ రాజేశ్వరి, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.