ప్రజాశక్తి - భీమవరం రూరల్
రైతు ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. తాడేరు గ్రామంలో రూ.21.80 లక్షల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు, నేడు రైతులను ఆదుకున్నది వైఎస్‌ఆర్ కుటుంబమేనని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నెలలోపు పంటల బీమాను వర్తింపజేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. మార్కెట్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించడం లేదని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించిందన్నారు. అలాగే రైతులకు ధాన్యం సొమ్ము నిర్ణీత గడువు కంటే ముందుగానే చెల్లించడం జరుగుతుందన్నారు. తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. అనంతరం రైతు భరోసా కేంద్రానికి స్థలం ఇచ్చిన దాతలు బండి వీర వెంకట నాగ సత్యప్రసాద్, పెనుకుదురు సీతయ్య, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, వెంకటరత్నం, సూర్యనారాయణను ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు.
ఇంటి ముంగిటకే ప్రభుత్వ పాలన...
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటి ముంగిటకే ప్రభుత్వ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. బేతపూడిలో రూ.40 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడారు. బేతపూడి గ్రామ ప్రజలు సచివాలయ సేవలను వినియోగించుకోవాలన్నారు. దాతలు కడియం రామన్న, నాగభూషణం, సూరయ్యల వారసులను ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమాల్లో ఎఎంసి ఛైర్మన్ కోటిపల్లి బాబు, జిల్లా ఎంపిపిల ఛాంబర్ అధ్యక్షులు పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్‌పిటిసి కాండ్రేగుల నరసింహారావు పాల్గొన్నారు.










