బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండలంలో అధికార పార్టీ నాయకుల మట్టి మాఫియా పేట్రేగిపోతోందని, వీరిపై చర్యలు తీసుకుని రైతులను కాపాడాలని సిపిఎం నాయకులు కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఓ.నల్లప్ప, మండల కార్యదర్శి కుళ్లాయప్పలు మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ బుక్కరాయసముద్రం నక్కలతిప్పకొండలో మట్టి తవ్వుకునేందుకు అధికార పార్టీ నాయకుడు లీజు పొందాడన్నారు. సదరు నేత అక్కడితో ఆగకుండా కొండ సమీపంలోని రైతుల పొలాల్లో మట్టిని కూడా తవ్వి విక్రయిస్తున్నాడని చెప్పారు. సర్వే నంబర్ 396-7లో బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన కూరపాటి నారాయణ శెట్టి తన కుమారులైన కె.సురేష్ రాజా, సుధాకర్‌లకు పిత్రార్జితంగా భూమి వచ్చిందన్నారు. ఖాతా నెంబర్ 1276, 1277లో వీరు హక్కులు కలిగి ఉన్నారన్నారు. ఈ పొలాల్లో చికెన్ నారాయణస్వామి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని తెలిపారు. బాధితులు ప్రత్యక్షంగా లీజు దారునితో మాట్లాడితే మట్టి తరలింపును ఆపేది లేదని, దిక్కున్న చోటు చెప్పుకో అని బెదిరిస్తున్నారని తెలిపారు. మట్టి మాఫియా చేస్తున్న అక్రమాలను పదేపదే సిపిఎం జిల్లా అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలియజేస్తున్నా వారు స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా బాధిత రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తిపై రెవెన్యూ అధికారులు స్పందించి, మట్టి మాఫియా అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని కోరారు. లేకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలియజేశారు.










