రైతు మృతి బాధాకరం
నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ హరినారాయణన్
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: కుటుంబపెద్దను కోల్పోవడం చాలా భాధాకరమని, ఈ సంఘటనకు సంబంధించి ఎవరి వల్లనైనా అన్యాయం జరిగి ఉంటే చర్యలు తీసుకొంటామని కలెక్టర్ యం.హరినారాయణన్ పేర్కొన్నారు. ఇటీవల పెనుమూరు తహశీల్దార్ కార్యాలయంలో మతి చెందిన రత్నం కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్‌ను కలిశారు.ఈ సందర్బంగా బాధిత కుటుంబం జరిగిన సంఘటనలకు సంబంధించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా బాధాకరమని కుటుంబ పెద్దను కోల్పోయారని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందనన్నారు. ఆదే విధంగా పోలీసుల విచారణ జరిపి ఎవరైనా ఈ సంఘటనకు సంబంధించి బాధ్యులుంటే వారిపై చట్టప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. రెవెన్యూ పరంగా జిల్లా రెవెన్యూ అధికారిని విచారణ అధికారిగా నియమించడం జరిగిందని వారం రోజుల లోపల ఆయన తన విచారణను పూర్తి చేసి నివేదిక ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రత్నం కుటుంబ సభ్యులకు తెలిపారు. తమ కుటుంబానికి తండ్రి ఆధారం అని తమకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని వారు జిల్లా కలెక్టర్ ఎదుట వారు తెలిపారు.










