అనంతపురం కలెక్టరేట్ : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సిఎం జగన్ ఇద్దరూ రైతులకు ద్రోహం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మండిపడ్డారు. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలని, హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి పదివేల క్యూసెక్కులకు పెంచాలని, సమాంతర కాలవ నిర్మించాలని, కర్ణాటకలో అప్పర్ భద్రా, నవలీ ప్రాజెక్టులను ఆపాలని, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ సిపిఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతుగర్జన సభను నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రామకృష్ణతో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్, న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు. జగన్మోహన్‌రెడ్డి పాలనలో వ్యవసాయ రంగానికి నిధులు ఖర్చు చేయకపోవడమే కాకుండా రాష్ట్రంలో ఒక్క పిల్ల కాలువ సైతం తవ్విన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సైతం అతీగతి లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. గొరుచుట్టు మీద రోకలి పోటులా కర్నాటకలో అప్పర్ భద్రా లిఫ్ట్ ఇరిగేషన్, నవలి ప్రాజెక్టులు నిర్మిస్తే రాయలసీమ ప్రాంతవాసులు మరింత సాగునీటి సమస్యలకు లోనవుతారని ఆవేదన వ్యక్తంచేశారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలన్నారు. ఇటీవల అకాల వర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోయి ఆర్ధికంగా చితికిపోయిన రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడగలుపుకుని రైతులకు చేస్తున్న అన్యాయంపై సిపిఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న పోలవరం నిర్వాసితులను సమీకరించి అక్కడే భారీసభకు శ్రీకారం చుట్టామన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ మాట్లాడుతూ హెచ్‌ఎల్‌సికి తుంగభద్ర నుంచి వస్తున్న నీరు మాత్రమే ఏకైక సాగు నీటి వనరు అన్నారు. తుంగభద్ర ద్వారా హెచ్‌ఎల్‌సి నుంచి 32 టిఎంసీల నీరు అందేలా చట్టబద్ధత ఉన్నా ఇప్పటి వరకు పూర్తి సామర్థ్యం నీరు వినియోగించలేదన్నారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వం కాలువల ద్వారా మోటార్ పెట్టి నీటిని తరలించడం, కాలువలకు గండ్లు పడేలా చేయడం వంటి విధానాలను కర్ణాటక ప్రభుత్వాలు అనుసరించాయని తెలిపారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కర్టాటకలో తుంగభద్ర పైన తుంగభద్ర నదులపైన నీరు తుంగభద్రలోకి రానివ్వకుండా కేవలం 5 జిల్లాల 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 300 గ్రామాలకు తాగునీరు అందించాలనే పేరుతో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని తెలిపారు. గడిచిన ఎన్నికల్లో లబ్ది పొందడానికి రాయలసీమకు తీరని ద్రోహం చేసిందన్నారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులకు నీరు రావాలంటే తుంగభద్ర నుంచే రావాల్సి ఉందన్నారు. అప్పర్ భద్ర ద్వారా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. అప్పర్ భద్రా ప్రాజెక్టును ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ, రైతుసంఘాల నాయకులు పాల్గొన్నారు.










