అనంతపురం : అనంతపురం మార్కెట్‌యార్డు రైతును దోపిడీ చేసే మార్కెట్‌లాగా ఉందని ఎపి రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య, ప్రభాకర్‌రెడ్డిలు విమర్శించారు. శుక్రవారం ఉదయం వారు అనంతపురం నగరంలోని మార్కెట్‌యార్డును పరిశీలించారు. అక్కడికొచ్చిన చీనీ రైతులతో మాట్లాడారు. అదే విధంగా అక్కడ జరుగుతున్న అమ్మకాలు, కొనుగోళ్లను చూశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ దళారీ వ్యవస్థ లేకుండా రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ ప్రభుత్వం ఈ-నామ్ పద్ధతిని అమలు చేస్తోందని తెలిపారు. దీని ప్రకారం కాయ క్వాలిటీని కంప్యూటర్ ద్వారా నిర్ధారించి ధరను అధికారులు ప్రతిపాదిస్తారన్నారు. కాని అనంతపురం మార్కెట్‌కు రైతులు తెచ్చిన చీనిపంటకు ధరను ఆ రకంగా అధికారులు ప్రతిపాదించడం లేదని పేర్కొన్నారు. వ్యాపారులే ధర నిర్ణయిస్తున్నారన్నారు. దీని ద్వారా రైతుకు అందాల్సిన ధర అందటం లేదని తెలిపారు. ఇది ఈ-నామ్ మార్కెట్ కాదని రైతులను దోపిడీ చేసే మార్కెట్‌లాగా ఉందని విమర్శించారు. ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌లో ప్రస్తుతం చీనీ టన్ను ధర కనిష్టంగా నాలుగు వేలు గరిష్టంగా రూ.12 వేల వరకు ఉందని తెలిపారు. ఈ ధర వలన రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు ధర లభించదని చెప్పారు. కనీసం టన్ను రూ.30 వేల వరకైనా ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. అదే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కమీషన్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కమీషన్ నాలుగు శాతమయితే, ఇక్కడ పది శాతం ఉందని తెలపారు. ఇంత దోపిడీ ఎక్కడా ఉండదన్నారు. ఈ దోపిడీపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పండ్లతోటల రైతు సంఘం అధ్యక్షులు శివారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు బిహెచ్.రాయుడు, కుళ్లాయప్ప, రాముడు, రవిశేఖర్‌రెడ్డి, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










