అనంతపురం కలెక్టరేట్; గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్నది రైతు దినోత్సవం కాదని అది రైతు దగా విద్రోహ దినోత్సవం అని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, వ్యవసాయ పరికరాలు సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, అనంతపురం జిల్లా అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, టిడిపి అనంతపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్‌ఛార్జి ఉమా మహేశ్వరనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, రాష్ట్ర నాయకులు వెంకటశివుడు యాదవ్, దేవళ్లమురళి, ఆదినారాయణ, శివబాల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వం చెప్పుకుంటూ రాష్ట్రంలోని రైతులను వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు. రైతులు రూ.1500 కోట్లు పైబడి నష్టపోతే కనీసం 30 శాతం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల రాయితీలు పూర్తిగా ఎత్తివేశారన్నారు. జిల్లా రైతులను దగా చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లాలో పర్యటించే హక్కు లేదన్నారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ బటన్ నొక్కే పథకాలు తప్పా సాగునీరు అందించే బటన్ నొక్కలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇన్సూరెన్స్ చెల్లింపుల్లో రైతులకు రూ.500, రూ.800, రూ.1200 ఇవ్వడం అంటే వారిని దగా చేయడం కాదాని ప్రశ్నించారు. తండ్రి జయంతి పేరుతో రైతు దినోత్సవం అంటూ ఓట్లు కొల్లగొట్టే కార్యక్రమం తప్పా రైతులను ఆదుకునే కార్యక్రమం కాదన్నారు. ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉమా మహేశ్వరనాయుడు మాట్లాడుతూ అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా మంచేసిందన్నారు. 114 చెరువులకు నీరు అందిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రగల్బాలు పలికాడన్నారు. ఒక్క చెరువకు కూడా నీరు ఇవ్వని ముఖ్యమంత్రి ఏముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు పూర్తి స్థాయి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్‌ఒ గాయత్రిదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో టిడిపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నాయకులు కేశవరెడ్డి, రాంమోహ్మన్ నాయుడు, నారాయణస్వామియాదవ్, ధనుంజయ, పురుషోత్తం, శ్రీనివాసరెడ్డి, మాజీ గ్రంథాలయ ఛైర్మన్ గౌస్‌మొద్దీన్, మాజీ మేయర్ స్వరూప, గాండ్ల విశాలాక్షి, నాగరాజు, సరిపూటి రమణ, డిష్.నాగరాజు, మారుతి కుమార్‌గౌడ్, జెఎల్.మురళి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










