ప్రజాశక్తి-ఉరవకొండ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం ఉరవకొండ డివిజన్ ఎడిఎ పద్మజాతో కలిసి మండలంలోని చిన్నముష్టూర్, విడపనకల్లు మండల పరిధిలోని వేల్పుమడుగు గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామస్థాయి వ్యవసాయ సలహా మండలి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులతో మాట్లాడి ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసిన వివిధ రకాల పంటలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని సిబ్బంది సూచించారు. వర్షాభావ పరిస్థితులను బట్టి ఇప్పటి వరకూ డివిజన్ పరిధిలో ఎంతమేరకు సాగైందో వివరాలు తెలుసుకుని మిగిలిన భూముల్లో ప్రత్యామ్నాయంగా సాగు చేయాల్సిన విత్తన సాగు గురించి వివరించారు. పిఎం కిసాన్ పరిధిలో వందశాతం ఇకెవైసి పూర్తి చేయాలన్నారు. ఎంపిసిఐ లింకు చేయించుకుని రైతులు ఎవరైనా ఉంటే రెండురోజుల్లోగా లింక్ చేయించేలా చూడాలని సూచించారు. అర్హులైన కౌలు రైతులను గుర్తించి సిసిఆర్‌సి కార్డులు అందేలా చూడాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులను రైతు భరోసా కేంద్రాల్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం రైతు భరోసా కేంద్రాల్లోని రికార్డులను పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం వేల్పుమడుగులో రైతులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఎరువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ, విడపనకల్ మండల వ్యవసాయ అధికారులు శుభకర్, పెన్నయ్య, గ్రామ వ్యవసాయ అధికారులు భీమేష్, కుళ్లాయినాయక్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ










