Jul 31,2022 21:31

రైతు బజారు వెలవెల..!
రైతులు లేక ఇక్కట్లు
సొంతంగా ఎదగాలనే నిబంధనే అడ్డంకి
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

ఇది చిత్తూరులో ఉన్న రైతు బజారు. ఇక్కడ ఉన్న దుకణాలన్నీ ఒకప్పుడు రైతులతో, వినియోగదారులతో ఆహ్లాదకరంగా ఉండేది. నిత్యం రద్దీతో సందడిగా ఉండేది. ఇప్పుడు ఇలా అమ్మేవారు లేక.. కొనేవారు రాక ఇలా వెలవెల పోతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం రైతు బజారులన్నీ సొంతంగా ఎదగాలనే నిబందనే కారణం. దీనివల్ల అమ్మకానికి ఎవరూ ఇక్కడకు రావడం మానేశారు.
చిత్తూరులోని రైతు బజారుకు 20ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రైతులు తాము ఉత్పత్తి చేసిన పంటలను ఇక్కడకు తీసుకొచ్చి అమ్ముకోవాలనే ఉద్దేశంతో వీటిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించారు. ఉమ్మడి జిల్లాలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఉండే రైతు బజారు బాగా నడుస్తోంది. అయితే చిత్తూరులో మాత్రం అమ్మకం దారులు లేక ఇలా వెలవెల పోతోంది.
మూడు నెలల క్రితం వరకు చిత్తూరులోని రైతు బజారుకు కూరగాయలు ఎవరు తెచ్చి అమ్ముకోవాలన్నా ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. దీంతో రైతులే కాకుండా ఇతర వ్యాపారస్తులు కూడా ఇక్కడ అమ్ముకుని జీవిస్తుండే వారు. ఈ రైతు బజారును నడిపేందుకు ఏడుగురు సిబ్బంది కూడా పని చేసేవారు. వీరికి జీతాలు మార్కెట్‌ కమిటీ నుంచి వచ్చేది. అయితే ఆరు నెలల క్రితం ప్రభుత్వం రైతు బజార్లు అన్నీ సొంతంగా నిలదొక్కుకోవాలని నిర్ణయించింది. వాటి ద్వారా వచ్చే డబ్బులతోనే సిబ్బంది వేతనాలు తీసుకోవాలనే నిబంధన పెట్టారు. ఇది రైతు బజార్ల పాలిట శాపంగా మారుతోంది.
జిల్లా కేంద్రంలో ఉన్న రైతు బజారులో 73కౌంటర్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం రైతులు కాకుండా ఎవరైనా కూరగాయలు అమ్ముకోవాలంటే రూ.1500లు నెలకు బాడుగ చెల్లించాల్సి ఉంది. ఉన్నట్టుండి ఇంత పెద్ద మొత్తంలో బాడుగ పెట్టడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం 15 షాపులు మాత్రమే నడస్తున్నాయి. ఇక్కడ రైతులు ఎవరైనా అమ్ముకోవాలన్నా ప్రస్తుతం షాపులు నడుపుతున్న వారు వారిని తరిమేస్తున్నారని సమచారం. బాడుగలు కట్టి తాము అమ్ముకుంటూ ఉంటే మీరు వచ్చి ఎలా అంగడి పెడతారని వారితో గొడవకు దిగుతున్నారని తెలుస్తోంది. దీనిపై ఇక్కడున్న సిబ్బంది నోరు మెదపడం లేదు. దీంతో ఇక్కడరైతులు ఎవరూ పెద్దగా రావడం లేదు.
ఇదిలా ఉంటే చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలో ఎవరైనా కూరగాయలు, ఇతరరత్రా వస్తువులు అమ్ముకోవాలంటే కార్పొరేషన్‌ ఉచితంగా అవకాశం కల్పించింది. ఆర్‌టిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయానందరెడ్డి టెండర్‌ పాడి, ఎవరూ గేట్‌ కట్టనవసరం లేదని తేల్చేశారు. దీంతో ఎక్కువ మంది కార్పొరేషన్‌ పరిధిలో ఎక్కడైనా రోడ్డు పక్కన అమ్ముకుంటున్నారు. అక్కడ ఉచితంగా అవకాశం ఉండడంతో, రైతు బజారుకు వచ్చి నెలకు రూ.1500లు కట్టేందుకు ముందుకు రావడం లేదు.