Oct 26,2023 22:47

పాడైన పంటను పరిశీలిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- రణస్థలం:  వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేసారు. మండలంలో నగరంపాలెం, ఉప్పునివలస గ్రామాల్లో నీరు లేక ఎండిపోయిన, తెగుళ్లు వచ్చిన పంటలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాల్లేక, కాలువల ద్వారా నీరందక జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో శివారు భూములకు నీరందడం లేదని తెలిపారు. పంటలు పచ్చగా కనిపిస్తున్నా నీరులేక భూమి బీటలు వారిందన్నారు. వంశధార, నాగావళి నదుల్లో నీళ్లు ఉన్నా నీటి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తోటపల్లి కాలువలకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారని, పంటలకు నీరులేక కరువు వల్ల తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యామ్నాయంగా రెండో పంటకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, అన్నిరకాల రుణాలను రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, కాలువల మరమ్మతులు చేసి శివారు భూముల వరకు నీరు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ ద్వారా 200 రోజుల పనులు కల్పించి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని, పంటల బీమా రైతులందరికీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వీరితో పాటు బొంతు శ్రీరాం ఉన్నారు.