ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్
పూలపల్లి గ్రామంలో శ్రీజయలక్ష్మి వెంకట నరసింహ రైస్ మిల్లును జిల్లా జాయింటు కలెక్టర్ ఎస్.రామ్ సుందర్‌రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం, మిల్లర్ల దగ్గరకు వచ్చిన వాహనాలను ఆయన పరిశీలించారు. ఒక లోడు దిగుమతికి ఎంత సమయం పడుతుంది, ఎంత మంది హమాలీలు పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారా అని ఆరా తీశారు. రైస్ మిల్లులో సీసీ కెమెరాలు ఉన్నాయా, అవి పనిచేస్తున్నాయా లేదా అని స్వయంగా పరిశీలించారు. జెసి మాట్లాడుతూ రైసు మిల్లుల నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తే తన దృష్టికి తేవాలన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి అపోహలూ పెట్టుకోవద్దన్నారు. ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రవాణా ఛార్జీల విషయంలో వాహనదారులు రైతులను ఇబ్బందులు పెడితే వెంటనే దగ్గర్లోని అధికారులకు తెలియజేయాలన్నారు. రైతులు నుండి కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ము నిర్ణీత సమయంలో వారి ఖాతాల్లో జమవుతున్నాయన్నారు. రైతులకు అవసరమైన గోనె సంచులు ఆర్‌బికెల ద్వారా అందిస్తున్నామన్నారు. సంచుల కొరతలేదని తెలిపారు. జెసి వెంట ప్రత్యేక అధికారి, జిల్లా నీటి వనరుల శాఖ అధికారి పి.నాగార్జునరావు, తహశీల్దార్ సిహెచ్ పెద్దిరాజు, ఎంపిడిఒ సంగాని వెంకటేశ్వరరావు, ఎఒఎస్ అబ్దుల్ రహీమ్ పాల్గొన్నారు.










