
* రైల్వేశాఖ మంత్రిని కోరిన జెడ్‌పి చైర్‌పర్సన్
ప్రజాశక్తి - ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నెలకొన్న రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ కోరారు. న్యూఢిల్లీలో గురువారం ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పలాస-విశాఖ-పలాస రైలు నంబరు 08531-08532ను బరంపురం వరకు పొడిగించాలని కోరారు. అమృత్ భారత్ పథకం కింద సోంపేట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో పూరీ, అహ్మదాబాద్, గాంధీనగర్, యశ్వంత్‌పూర్ రైలును నిలుపుదల చేయాలని కోరారు. సోంపేటలో ఫలక్‌నుమా, జునగఢ్ రోడ్ ఎక్స్‌ప్రెస్ రైలును నిలుపుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాడుపూడి, బారువ రైల్వేస్టేషన్లలో బరంపురం-విశాఖ రైలును నిలుపుదల చేయాలని కోరారు. ఇచ్ఛాపురం మున్సిపాల్టీలోని ఎల్‌సి గేటు వద్ద ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొలిగాం రోడ్డులో ఆర్‌అండ్‌బి రోడ్డు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్నారు. జాడుపూడి రైల్వేస్టేషన్ పశ్చిమ భాగంలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు ఉత్తరాన బాహుదా నదికి దగ్గరలో ఉన్న అండర్ పాసేజ్ బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.