Sep 19,2023 21:19

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్‌ నవీన్‌

* అధికారులకు ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఆదేశం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
మూలపేట పోర్టుకు రైలు, రోడ్డు మార్గాలకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎం.నవీన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మూలపేట పోర్టు రైలు, రోడ్డు మార్గాలకు సంబంధించి భూసేకరణపై టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌తో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ట్రాక్‌కు సంబంధించి భూసేకరణ వివరాలు అందించాలని సంతబొమ్మాళి తహశీల్దార్‌ను ఆదేశించారు. సంతబొమ్మాళి మండలంలో రైల్వే ట్రాక్‌ వేసేందుకు భూసేకరణ రాజపురం, కూర్మనాధపురం, పోతునాయుడుపేట, హేమాలపేట, కాశీపురం, కోటపాడులో 79.45 ఎకరాలు సిద్ధంగా ఉందని తహశీల్దార్‌ చలమయ్య వివరించారు. టెక్కలి మండలంలో రోడ్డుకు సంబంధించి రఘునాథపురం భూములను సత్వరమే పోర్టు వారికి అప్పగించాలని టెక్కలి తహశీల్దార్‌ ప్రవళ్లికాప్రియను ఆదేశించారు. బన్నువాడ, వేములవాడ, మోదుగువలస భూముల్లో రైతులు ఎవరు ఉన్నారనే వివరాలను తక్షణమే అందించాలన్నారు. ఈ గ్రామాలకు అవార్డు పెండింగ్‌లో ఉందని, ఆ వివరాలు శుక్రవారం నాటికి పంపాలన్నారు. సమావేశంలో భూసేకరణ సెక్షన్‌ పర్యవేక్షకులు జి.ఎల్‌.ఇ శ్రీనివాసరావు, ఇ-సెక్షన్‌ విభాగం పర్యవేక్షకులు డి.రామ్మూర్తి, మారిటైం బోర్డు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.