Jun 03,2023 22:21

రైలు ప్రమాద మృతులకు నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకున్న రైలు ప్రమాద మృతులకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రైల్వేస్టేషన్‌ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి మాట్లాడుతూ మూడు రైళ్లు ఢకొీని వందలాది మంది ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. వీరికితోడు వేలమంది క్షతగాత్రులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వే పట్ల, రైల్వే ప్రయాణికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైల్వేలో కొన్ని శాఖలు ప్రయివేట్‌ పరం చేయడంతోనే ఈ సంఘటన జరిగిందన్నారు. వందే భారత్‌ రైలును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం మిగిలిన రైల్వేను నిర్వీర్యం చేసిందన్నారు. రైల్వే ప్రమాదాలు జరగకుండా వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన భారత్‌ కా కవచ్‌ ఏమైపోయిందని ప్రశ్నించారు. ఒకే పేరు కలిగిన రైలుకు వందల సార్లు కేవలం జెండా ఊపడం కోసమే వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం కాదని హితవు పలికారు. ఈ ప్రమాదానికి నరేంద్ర మోదీనే పూర్తిగా నైతిక బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రైలు ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని, రైలు ప్రమాదంలో మరణించిన వారికి ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు ముస్కీన్‌, వెంకట నారాయణ, వలీ, ప్రకాష్‌, మసూద్‌, రాజు, ఎన్టీఆర్‌ సీనా, గఫూర్‌, లక్ష్మీనారాయణ, వరలక్ష్మి, ఎస్కే మహమ్మద్‌, ఇస్మాయిల్‌, తదితరులు పాల్గొన్నారు.