Aug 03,2023 22:34

కియా వద్ద మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు

       అనంతపురం ప్రతినిధి: టిడిపి అధికారంలోకి వచ్చాక గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ద్వారా రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు తెలియజేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చిన ఆయన గురువారం నాడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతపురం నగరంలో ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాలులో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా రాష్ట్రంలోని సాగునీటి వనరులు, పంపిణీ ఏ రకంగా చేపట్టడం ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నీరు అందివ్వ వచ్చున్న అంశాలను వివరించారు. ఇందులో గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం గురించి తెలియజేశారు. ఈ నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ జిల్లాలకు నేరుగా 280 టిఎంసిల నీరు అందివ్వవచ్చునని వివరించారు. తద్వారా రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాకు ప్రతి ఎకరానికీ నీటిని అందిస్తామని హామీనిచ్చారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ తరువాత సాగునీటి ప్రాజెక్టుల సందర్శన యాత్రను ప్రారంభించారు. ఆత్మకూరు మండలంలోని సింగనగుట్టపల్లి వద్ద జరుగుతున్న హంద్రీనీవా పనులను పరిశీలించారు. అనంతపురం పెనుకొండ వద్దనున్న కియా కార్ల పరిశ్రమ వద్ద సెల్ఫీ ఛాలెంజ్‌ దిగారు. రాత్రికి కదిరి పట్టణానికి చేరుకున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఈ యాత్ర సందర్భంగా పలుచోట్ల మాట్లాడారు. వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మఖ్యమంత్రి అయినప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. 198 ప్రాజెక్టు పనులను రాష్ట్ర వ్యాప్తంగా ఆపారని తెలిపారు. ఇందులో రాయలసీమకు సంబంధించి 102 ప్రాజెక్టులుండగా అనంతపురం జిల్లాకు సంబంధించి 38 ప్రాజెక్టులు రద్దు చేసినవి ఉన్నాయన్నారు. ఇవి రద్దు చేయడమే కాకుండా మరో ఐదేళ్లు చేపట్టడానికి వీల్లేకుండా జీవోను ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అజ్ఞానం, ముర్ఖత్వం కారణంగా రాయలసీమ ప్రాజెక్టుల విధ్వంసం జరిగిందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటున్న వైసిపి ఎమ్మెల్యేలు తమ సామ్రాజ్యాలుగా దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వీటన్నింటికీ తాము అధికారంలోకి వచ్చాక లెక్కలు చెబుతామని హెచ్చరించారు. టిడిపి హయంలోనే కియా పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభం అవకుండా ఉంటే దీన్ని వెళ్లిపోయే విధంగా చేసే వారని ఆరోపించారు. అలా ప్రారంభం కాని జాకీ పరిశ్రమ ఏమైందని ప్రశ్నించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు పేరుతో పెద్దఎత్తున హడావుడి చేసి ఆ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టి రూ.600 కోట్లు అప్పనంగా దోచిపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది వేల క్యూసెక్కులకు పెంచుతామన్న హంద్రీనీవా కాలువ పనులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేవలం జీవోలకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లాలోనే బిటిపి, పేరూరు, సామూహిక బిందు సేద్యం పనులన్నీ ఆగిపోయాయని చెప్పారు. భవిష్యత్తులో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీటి వసతి కల్పిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బికె.పార్థసారధి, కందికుంట వెంకటప్రసాధ్‌, ప్రభాకర్‌చౌదరి, జెసి.ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.