కణేకల్లు : రాయదుర్గం రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిదంటే.. తమ ప్రభుత్వంలోనే జరిగిదంటూ టిడిపి, వైసిపి నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి పేరుతో అధికారపార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, రాయదుర్గం టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాలవ శ్రీనివాసులు మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఎన్.హనుమాపురం వేదికగా నేతల సవాళ్లు..
కణేకల్లు మండల పరిధిలోని ఎన్.హనుమాపురం పంచాయితీ అభివద్ధిపై ఇటీవల ఈ రెండు పార్టీల నేతల మధ్య సవాళ్లు నడుస్తున్నాయి. హనుమాపురం పంచాయతీ వేదికగా గురువారం నాడు బహిరంగ చర్చకు ఇద్దరు నాయకులు సిద్ధమయ్యారు. ఇటీవల హనుమాపురం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. హనుమాపురం గ్రామం అభివద్ధిపై కాపు మాట్లాడుతూ టిడిపి హయాంలో కాలవ శ్రీనివాసులు మంత్రిగా ఉన్నప్పుడు ఏం అభివద్ధి చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఆ పార్టీ చేసిన అభివృద్ధిపై గురువారం నాడు గడపగడపకూ వెళ్లి ప్రజలను కనుక్కొద్దామని కాలవకు సవాల్ విసిరారు. దీనికి ప్రతిగా కాలవ శ్రీనివాసులు స్పందించారు. హనుమాపురం గ్రామ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని, గురువారం నాడు ఆ గ్రామానికి వస్తానంటూ ప్రతిసవాల్ విసిరారు. దీంతో రెండు పార్టీల మధ్య అగ్గిరాజుకుంది. కాపు సవాల్‌ను స్వీకరిస్తున్నానని చెప్పి కాలవ శ్రీనివాసులు గురువారం మధ్యాహ్నం ఎన్.హనుమాపురం గ్రామానికి చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా రాయదుర్గం నియోజకవర్గం టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. ఇదే సమయంలో సవాల్ విసిరిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కూడా హనుమాపురం గ్రామానికి రాయదుర్గం నుంచి బయళ్దేరారు.
అడ్డుకున్న పోలీసులు... కాలవ అరెస్టు..
కాపు, కాలవ మధ్య సవాళ్ల పర్వాన్ని గుర్తించిన పోలీసులు అప్రమత్తం అయ్యారు. కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు హనుమాపురం గ్రామానికి చేరుకున్నారు. టిడిపి కార్యకర్తలతో కలిసి హనుమాపురం గ్రామంలో ఉన్న కాలవ శ్రీనివాసులును బలవంతంగా అరెస్టు చేసి కళ్యాణదర్గం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇక హనుమాపురం గ్రామానికి వస్తున్న కాపు రామచంద్రారెడ్డిని బొమ్మనహల్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల నేపథ్యంలో హనుమాపురం వెళ్లేందుకు వీల్లేదంటూ ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి వెనక్కు పంపారు. ఇలా అధికార, ప్రతపక్ష పార్టీ నేతల మధ్య చోటు చేసుకున్న ఈ వివాదంతో హనుమాపురం గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గరయ్యారు.










