Apr 17,2023 21:50

వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌     రాయదుర్గం మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర యాదవ్‌ను సస్పెండ్‌ చేయాలని సిఐటియు, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు ఏజి.రాజమోహన్‌, మున్సిపల్‌ ఉద్యోగులు కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజులు వినతిపత్రం అందజేశారు. రాయదుర్గం మున్సిపాల్టీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా కొనసాగుతున్న రవీంద్ర యాదవ్‌ రాయదుర్గం పట్టణంలో పది సంవత్సరాలుగా విధులు అక్కడే కొనసాగిస్తూ అవినీతికి పాల్పడుతూ, కార్మికుల చేత వెట్టిచాకిరీ చేయించుకుంటూన్నాడని తెలిపారు. ఆ అధికారి విధుల్లో లేకుండా చెరకు రసం వ్యాపారంలో రాయదుర్గం పట్టణంలో 6 షాపులు, కళ్యాణదుర్గంలో 2 షాపులు లీజుకు తీసుకొని వ్యాపారంలో మునిగి తేలుతున్నాడని తెలిపారు. అధికారి వ్యాపారానికి కర్ణాటక హౌస్పేట్‌ చాలా సుదూర ప్రాంతం నుంచి చెరకు గడలు తెచ్చేందుకు మున్సిపల్‌ కార్మికులను పంపించి రాయదుర్గం పట్టణానికి తెప్పిస్తాడన్నారు. మున్సిపల్‌ కార్మికుల చేత వాటిని అన్‌లోడింగ్‌ చేయించడం, క్లీనింగ్‌, కట్టింగ్‌ చేయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని తెలిపారు. కొడవలితో కటింగ్‌ చేస్తుండగా హెచ్‌.తిప్పేస్వామి అనే కార్మికుడి చేతికి బలమైన గాయమైందన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర యాదవ్‌ హిందూపురం పట్టణంలో తన 6 సెంట్ల స్థలంలో రెండంతస్తుల భవనం నిర్మించాడన్నారు. ఆ సమయంలో మున్సిపల్‌ కార్మికుల చేత ఇంటి పనులు, భవన నిర్మాణ పనులు చేయించుకున్నాడని తెలిపారు. కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫామ్‌, కొబ్బరినూనె, చెప్పులు ఇవ్వకుండా నాలుగేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు ఎర్రిస్వామి పాల్గొన్నారు.