Jan 20,2023 20:51

రాత పరీక్షకు పటిష్ట బందోబస్తు : జిల్లా ఎస్పీ
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక ప్రిలిమినరీ రాలపరీక్ష జరుగుతుందని జిల్లా ఎస్పీ రిషాంత్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం పోలీస్‌ గెస్ట్‌హౌస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో పోలీసు అధికారులు, రీజినల్‌ కోఆర్డినేటర్‌, సెంటర్స్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల వద్ద భద్రతా అంశాలు, ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 33 సెంటర్లలో 12,196 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, వీరిలో 9,719 పురుషులు, 2,477 మహిళలు ఉన్నారన్నారు. ఉదయం 9 గంటల నుండి రాత పరీక్ష రాసే సెంటర్లకు అభ్యర్థులను అనుమతీస్తామని తెలిపారు. ఉదయం 10 గంటలకి ఒక నిమిషం దాటినా అభ్యర్థులను రాతపరీక్షకు అనుమతించరని, అభ్యర్థులు ఇది గమనించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకొని ముందుగా రావాలన్నారు. పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలను మొత్తం 452 మంది పోలీసులతో చేపడుతున్నామన్నారు. పోలీసు అధికారులు, రీజనల్‌ కోఆర్డినేటర్లతో పకడ్బందీ చర్యలతో పాటు ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అభ్యర్థులు వెంట తెచ్చుకునే విలువైన సామాన్లు వారే సొంతంగా భద్రపరచుకోవాలని, రాత పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్‌లో సూచించే నియమ నిబంధనలు పాటించాలన్నారు. మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ వాచ్‌, బ్లూటూత్‌ తదితర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ పరీక్ష హాల్లోకి అనుమతించరని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్‌ షాపులు మూసి వేయబడునని, 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున, పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడడం నిషేధమని, 100 మీటర్ల పరిధి వరకు ఎటువంటి వాహనాలను పార్కింగ్‌ చేయరాదని పేర్కొన్నారు. పరీక్ష సజావుగా జరిగేందుకు పర్యవేక్షణకు అడిషనల్‌ ఎస్పీ (పరిపాలన) నోడల్‌ ఆఫీసర్‌ పి.జగదీష్‌, వివిధ పరీక్షా కేంద్రాలలో డిఎస్పీలు, ఇన్స్పెక్టర్‌ ర్యాంకు అధికారులతో ఫ్లయింగ్‌ స్క్వాడ్లను నియమించడం జరిగిందన్నారు.