May 18,2023 21:48

కరపత్రాలు విడుదల చేస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు

          ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌  జూన్‌ 2, 3, 4వ తేదీల్లో విశాఖపట్నం నగరంలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలక్రిష్ణ, నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం నగరంలోని గణేనాయక్‌ భవన్‌లో ఇందుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న యువజన సంఘం డివైఎఫ్‌ఐ మాత్రమే అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి సంవత్సరానికి రెండు లక్షలు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. దేశంలో ప్రధాన ఉపాధి రంగాలైన రైల్వే, రక్షణ రంగాలలో దాదాపు పది లక్షల ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయడంలో మోేదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. డివైఎఫ్‌ఐ యువజన సంఘం ఒకవైపు నిరుద్యోగ సమస్య పోరాడుతూనే, రెండోవైపు అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. కరోనా సమయంలో ఐసోలేషన్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి వేలాది మందికి సేవలు అందించిందని గుర్తు చేశారు. నిరుద్యోగుల కోసం అవగాహన సదస్సులు, కోచింగ్‌ సెంటర్లలో ఉచితంగా స్టడీపుస్తకాలు అందించామని తెలియజేశారు. ఈ రాష్ట్ర స్థాయి క్లాసులలో ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా తరగతులు జయప్రదం కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ శిక్షణ తరగతులలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 350 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు సాధిక్‌ వలి, రఫీ తదితరులు పాల్గొన్నారు.