రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
పిఇఎస్ పబ్లిక్ పాఠశాల వేదికగా రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమ్యయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిత్తూరు జిల్లా డిఎస్పి కె శ్రీనివాసమూర్తి శాంతి పావురాలను ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ జట్ల ఆటగాళ్ళను ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రీడా పోటీలలో జయాపజయాలు సర్వసాధారణమని, ఓటమి గెలుపుకు సోపానమని, నిరుత్సాహ పడకుండా ముందడుగు వేయాలని తెలిపారు. చిత్తూరు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంగల్రాయ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనపరచాలని ఆకాంక్షించారు. ఆటల వలన విద్యార్థులు చదువులో ఏకాగ్రతను చూపించగలరని సూచించారు. పి ఈ ఎస్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, సేవా తత్పరుడు, కార్యదక్షుడు, డాక్టర్ ఎం. ఆర్ .దొరస్వామి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, పాల్గొనే జట్ల సభ్యులను ఉద్దేశించి, రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలను పి ఈ ఎస్ పబ్లిక్ పాఠశాల చిత్తూరులో నిర్వహించడం గర్వకారణం అన్నారు. ఈ పోటీల వలన పి ఈ ఎస్ విద్యాసంస్థల కీర్తి రాష్ట్రవ్యాప్తంగా ప్రజ్వలింపనున్నది అన్నారు. క్రీడా పోటీల వలన మానసిక ఉల్లాసంతో పాటు, శారీరకంగా ,దఢంగా విద్యార్థులు రూపొందుతారన్నారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు పరిసర ప్రాంత విద్యార్థులే కాకుండా, అనేక జిల్లాల నుండి 30 జట్లకు పైగా ఈ బాస్కెట్ బాల్ పోటీలలో పాల్గొనబోతున్నాయి. ఇందులో మొదటి రోజు మొత్తం ఏడు జట్లు తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో పి ఈ ఎస్ పబ్లిక్ పాఠశాల డైరెక్టర్ ఎం కుమార స్వామి నాయుడు, పాఠశాల ప్రిన్సిపాల్ వై.వి. కష్ణ బాబు పాల్గొన్నారు.










