
* అరెస్టులకు భయపడేది లేదు
* ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు
ప్రజాశక్తి - ఇచ్ఛాపురం, పలాస, కోటబొమ్మాళి: రాష్ట్రంలో కక్షపూరిత రాక్షస పాలన సాగుతోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఇచ్ఛాపురం, పలాస, కోటబొమ్మాళిలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కుట్ర పన్ని కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు ఎటువంటి తప్పు చేయకున్నా ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. నిజాలన్నీ బయటకు వస్తాయని, కాకపోతే కొంచెం సమయం పడుతుందన్నారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినంత మాత్రాన భయపడేది లేదన్నారు. టిడిపి ప్రవేశపెట్టిన మేనిఫేస్టోతో వైసిపి వణుకు పుట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే అక్రమ అరెస్టులకు పాల్పడిందన్నారు. చంద్రబాబు జైలు నుంచి వచ్చి ముఖ్యమంత్రి అవుతారని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా టిడిపితో కలిసి వస్తున్నారని, వారినీ మనం ఆదరించాలన్నారు. పలాసలో అధికార పార్టీ నాయకులు ఏదో ఒక వివాదం సృష్టించి టిడిపి నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కోటబొమ్మాళిలో దీక్షలకు జనసేన నాయకులు కణితి కిరణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. తెలగ సంఘ నాయకులు కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, వజ్జ బాబూరావు, నాయకులు పీరుకట్ల విఠల్, కాళ్ల ధర్మారావు, కొండా శంకర్‌రెడ్డి, లొడగల కామేష్, బోయిన రమేష్, బోయిన గోవిందరాజులు, కింజరాపు హరివరప్రసాద్, మంలో మాజీ ఎమ్మెల్యే శివాజీ, పాల్గొన్నారు.