Sep 19,2023 21:38

మాట్లాడుతున్న కూన రవికుమార్‌

* స్కామ్‌ల ముఖ్యమంత్రికి స్కీమ్‌లు ఎలా తెలుస్తాయి?
* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌
* అరసవల్లికి పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
* పలువురు గృహ నిర్బంధం, అరెస్టులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ విమర్శించారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో యాదవ సాధికార కమిటీ ఆధ్వర్యాన మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలిసి ఆయన మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచేసి స్కామ్‌ల్లో ఇరుక్కుని జైలుకెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి స్కీమ్‌కు, స్కామ్‌కు మధ్య తేడా తెలియదన్నారు. అందువల్లే సిఐడిని తన గుప్పెట్లో పెట్టుకుని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో అవినీతి జరిగిందని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని ధ్వజమెత్తారు. చట్టసభల ఆమోదంతో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. ఇందులో ఎటువంటి పొరపాటు జరిగినా అథికారులు జవాబుదారులుగా నిలుస్తారని తెలిపారు. అలాంటిది కనీసం అధికారుల వివరణ లేకుండా చట్టసభలో ఆమోదించిన స్కీమ్‌లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఎలా దోషిగా చిత్రీకరిస్తారని ప్రశ్నించారు. సిఐడి చీఫ్‌గా ఉన్న అధికారి వాస్తవాలను వక్రీకరించి తాడేపల్లి స్క్రిప్టు చదువుతున్నారని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబుకు దేశంలోనే కాక ఇతర దేశాల్లో ప్రజలు రోడ్ల పైకి వచ్చి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వం శాంతియుతంగా సాగిస్తున్న ఉద్యమాలపై అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోందన్నారు. శాంతియుతంగా సాగిస్తున్న ఉద్యమాలను సైతం అడ్డుకుంటూ అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని ఆరోపించారు.
పాదయాత్ర అడ్డగింత
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విడుదల కావాలని కోరుతూ శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి నుంచి అరసవల్లి వరకు టిడిపి ఆధ్వర్యాన చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి శ్రీకాకుళం నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌. జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబుతో పాటు పలువురిని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాదయాత్రకు హాజరు కాకుండా టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ను శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను కవిటిలోని ఆయన నివాసంలో, మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవిని అరసవల్లిలోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎన్నాళ్లు ఇలా నిర్బంధిస్తారని బెందాళం అశోక్‌ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి తన నిరసనను శాంతియుతంగా తెలియజేసే హక్కు కలిగి ఉన్నాడని గుర్తుచేశారు. న్యాయం కోసం పోరాడతామంటే ఇంట్లో పెట్టి తాళం వేస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు. కూల్చివేతలతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం కూలిపోయే సమయం సమీపించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.