Aug 17,2023 21:59

రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు పిలుపు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

స్థానిక సిపిఐ కార్యాలయంలో గురువారం పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు మాట్లాడుతూ దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం మతోన్మాదం పేరుతో రెచ్చగొట్టి అధికారంలో లేని రాష్ట్రాల్లో చిచ్చులు పెట్టి ప్రభుత్వాలను కూలత్రోసి అధికారంలో రావడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కార్పొరేట్‌ శక్తులైన ఆదాని, అంబానీలకు కట్టపెట్టడానికి మోడీ ప్రభుత్వం చాకిరి చేస్తున్నదని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా అమలుపరిచే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరొక్కసారి అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నంలో దౌర్జన్యాలు, రౌడీయిజం పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్‌, గ్రావెల్‌, డ్రగ్స్‌ మాఫియా, గంజాయి వ్యాపారాలు విచ్చలవిడిగా జరుగుతున్న అడిగే నాధుడే లేదని వాపోయారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తే, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వారిపై పోలీసులు కేసులు పెట్టి భయభ్రాంతులను చేస్తున్నారని మండిపడ్డారు.