Jul 09,2023 22:54

బిజెపి మాజీ ఎంఎల్‌ఎ విష్ణుకుమార్‌రాజు కేంద్రంతో పోరాడాలి
అల్లూరి జయంత్యుత్సవాల ముగింపు సభలో సనీనటులు నారాయణమూర్తి
ప్రజాశక్తి - పాలకొల్లు

            కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ తగదని, దీనికి రాష్ట్రంలోని బిజెపి మాజీ ఎంఎల్‌ఎ విష్ణుకుమార్‌రాజు వంటి వారు కృషి చేయాలని సినీ నటులు నారాయణమూర్తి కోరారు. పాలకొల్లు అద్దేపల్లి వారి సత్రం వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ పాలనపై తీవ్రంగా విమర్శించారు. తాను జగన్‌పై ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. జగన్‌ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని, ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో ఉండదని చెప్పారు. దీనిపై నారాయణమూర్తి మాట్లాడుతూ విష్ణుకుమార్‌రాజు కేంద్రంపై పోరాడాలన్నారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటీకరణ చేయకుండా పోరాడాలని కోరారు. వెంకయ్యనాయుడు వంటి పెద్దలు ఇచ్చిన ప్రత్యేక హోదా వంటివి ఏ హామీలు అమలు కాలేదన్నారు. ముఖ్య అతిథి, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు మాట్లాడుతూ అనేక కేసుల్లో జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు.